DYFI | కోల్ సిటీ, నవంబర్ 12: గోదావరిఖని నగరంలో విచ్చలవిడిగా కేఫ్ ల పేరుతో స్మోకింగ్ జోన్ సెంటర్లను కొనసాగిస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ ఆరోపించారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ఇన్ చార్జీ కమిషనర్ జే ఆరుణ శ్రీని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైకి మాత్రం కాఫీ కేఫ్ అని బోర్డులు తగిలించి లోపల మాత్రం స్మోకింగ్ జోన్ సెంటర్లు నడుపుతున్నారని పేర్కొన్నారు.
ప్రధానంగా మైనర్ యువతను టార్గెట్ గా చేస్తూ ఈ స్మోకింగ్ సెంటర్లు కొనసాగుతున్నాయని తెలిపారు. వీటి మూలంగా యువత ఎక్కువగా బానిసలు అవుతున్నారని పేర్కొన్నారు. అంతేగాక అపరిశుభ్రమైన వాతావరణంలో ఈ స్మోకింగ్ సెంటర్లలో నాసిరకం పదార్థాలు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. వీటి వల్ల యువత ఆరోగ్యానికి హానీ కలిగే ప్రమాదం ఉందన్నారు. వెంటనే స్థానిక పోలీస్ శాఖ సంయుక్తంగా స్మోకింగ్ సెంటర్లలో ముమ్మర తనిఖీలు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు ఆట్ల శివకుమార్, సూర్య తదితరులు పాల్గొన్నారు.