కాంగ్రెస్ నాయకుల కబంధ హస్తాల్లో ఎకరాల కొద్దీ అసైన్డ్ భూములు చిక్కుకున్నాయి. చాలా మంది నాయకులు సదరు ఆస్తులను ఏళ్లకేళ్లుగా అనుభవిస్తున్నారన్న విమర్శలున్నాయి. 2004 నుంచి 2014 వరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ ల్యాండ్స్‌ను కాజేసినట్టు బయటపడుతున్నది. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల్లో పేర్లు రాయించుకొని పట్టాదారు పాసు పుస్తకాలు పొందడమే కాదు, కొంత మంది ఏకంగా క్రయవిక్రయాలు చేసినట్టు తెలుస్తున్నది.
అయితే సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు తప్పుడు రికార్డుల ద్వారా అసైన్డ్ భూములు ఆక్రమించుకున్నారంటూ అరెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు, అరెస్టుల పరంపర ఇంకా కొనసాగుతుందనే సంకేతాన్ని అధికార పార్టీ నాయకులు ఇస్తున్నారు. అలాగే ఎకరాల కొద్దీ అసైన్డ్ లాండ్స్‌ను బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకున్నారంటూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా కుట్రలు చేస్తున్నారు. నిజానికి లోతుగా వెళ్తే ఎంతో మంది హస్తం నాయకులు అసైన్డ్ను చెరపట్టారు.
ఒకటి రెండెకరాలు కాదు, ఏకంగా ఐదెకరాలను కూడా కైవసం చేసుకున్న నాయకులున్నారు. అసైన్డ్ భూములను ఎంచక్కా అనుభవిస్తున్న పలువురు కాంగ్రెస్ నాయకుల జాబితా ‘నమస్తే తెలంగాణ’ సంపాదించింది. వాటిని ప్రజలకు తెలుపడమే లక్ష్యంగా వివరాలు బహిర్గతం చేస్తున్నది. ఇవి మచ్చుకే అయినా.. లోతుగా వెళ్తే ఇంకా చాలా మంది అసైన్డ్ భూముల దందా బయటపడుతుంది.
కరీంనగర్, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చట్టం అనేది అందరికీ ఒకేలా ఉంటుంది. అదే నిజమైతే అసైన్డ్ ల్యాండ్ పేరిట బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్న మాదిరిగానే కాంగ్రెస్ నాయకులను కూడా అరెస్ట్ట్ చేయాలన్న డిమాండ్ వస్తున్నది. 2004 నుంచి 2014 సమయంలో చాలా మంది ‘హస్తం’ నాయకులు అసైన్డ్ భూములను చెర పట్టినట్టు తాజాగా లభిస్తున్న ఆధారాలు, రికార్డులను బట్టి తెలుస్తున్నది. ఒకటి రెండెకరాలు కాదు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సిరిసిల్ల మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పేరున ఐదెకరాల అసైన్డ్ ల్యాండ్ ఉన్నది. అలాగే కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కో-అర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ సతీమణి పేరిట మూడెకరాల పైచిలుకు అసైన్డ్ ల్యాండ్ ఉన్నది.
ఇవి మచ్చుకు మాత్రమే! నిజానికి లోతుగా వెళ్తే మెజార్టీ గ్రామాల్లోని అసైన్డ్ ల్యాండ్స్ కాంగ్రెస్ నాయకుల చేతుల్లోనే ఉన్నట్టు తెలుస్తున్నది. అంతేకాదు, సిరిసిల్ల చుట్టుపక్క గ్రామాల్లో అత్యంత విలువైన మెజార్టీ భూములు సైతం వీరి చెరలోనే ఉన్నట్టు తెలుస్తున్నది. నిజానికి కొంతమంది స్వచ్ఛందంగా అసైన్డ్ భూములను తిరిగి ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నా.. అందులో ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు తనకున్న అసైన్డ్ స్థలాన్ని తిరిగి ఇవ్వలేదు. అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 250 ఎకరాల వరకు ప్రభుత్వ స్థలాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించినా.. అందులో ఎవరైనా కాంగ్రెస్ నాయకులున్నారా.. లేరా..? అన్న వివరాలు మాత్రం ఇంకా వెలుగు చూడలేదు.
కేవలం బీఆర్ఎస్ నాయకులను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారన్న ప్రశ్నలకు ఇన్నాళ్లు అధికారులు, హస్తం నాయకులు చెబుతున్న సమాధానం ఒక్కటే! బీఆర్ఎస్ నాయకులే అసైన్డ్ భూములను కాజేశారని, అందుకే అరెస్ట్ చేస్తున్నామన్నా.. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నాయకుల బాగోతం ఒక్కొక్కటిగా బయట పడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేస్తారా..? లేక ఉపేక్షించి వదిలేస్తూ కేవలం బీఆర్ఎస్ నాయకులనే అరెస్టు చేస్తూ ముందుకెళ్తారా..? అన్నది మున్ముందు తేలనున్నది. అధికారులు ఇక ముందు తీసుకునే చర్యలను బట్టి.. వారు పక్షపాతంగా వెళ్తున్నారా..? లేక చట్టానికి లోబడి వెళ్తారా..? అన్నది కూడా స్పష్టం కానున్నది.
ఆ నలుగురి పేర్లపై ఉన్న ధరణి రికార్టులను పరిశీలిస్తే నేచర్ ఆఫ్ ల్యాండ్ కింద లావోని పట్టాగా చూపించారు. లావాదేవీల స్టేటస్‌లో మాత్రం ఈ సర్వే నంబర్లను, సబ్ డివిజన్ నంబర్లను అసైన్డ్ ల్యాండ్‌గా గుర్తించినట్టు నమోదు చేశారు.
– ఎల్లె లక్ష్మీనారాయణ ధరణి రికార్డు
సిరిసిల్లకు చెందిన ఇతని పేరు సంగీతం శ్రీనివాస్. ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్. కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణాధ్యక్షుడు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూడా. ఆయన సతీమణి సంగీతం విద్య పేరిట తంగళ్లపల్లి మండలం ఒబులాపూర్ (పి.కె.)లో సర్వేనంబర్ 368/1/24 ఖాతా నంబర్ 1295లో 3 ఎకరాల 3 గుంటల అసైన్డ్ స్థలం ఉన్నది.