Accused Arrested | రామగిరి, అక్టోబర్ 11 :రామగిరి మండల సమాఖ్య కార్యాలయం సమీపంలోని సెంటినరీ కాలనీ డీఆర్డీఏ, టీజీఎస్ఇఆర్ఎఫ్ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన దారుణ హత్య కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. 24 గంటల్లోనే హత్య నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం.. మృతుడు కోట చిరంజీవి, న్యూ మారేడుపాక గ్రామానికి చెందిన వ్యక్తి. పోతన కాలనీలో మీ సేవా సెంటర్ నడుపుతూ జీవించేవాడు.
పెంచికల్ పేట గ్రామానికి చెందిన సంధ్యారాణి, అనవేనా మల్లయ్య , అనవేనా నరేష్, పొలవెన కుమార్, పిడుగు చందు వీరి వద్ద నుంచి మూడు మోటార్‌సైకిళ్లు హత్యకు ఉపయోగించిన ఇనుపరాడు, చాకు స్వాధీనం చేసుకోని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ హత్య ఘటన పై అక్టోబర్ 10న కోట చిరంజీవి తమ్ముడు కోట రామ్‌చరణ్ ఫిర్యాదు మేరకు రామగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది.
పెద్దపల్లి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ కరుణాకర్ ఆదేశాలపై ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో మంథని సీఐ రాజు, గోదావరిఖని 2 టౌన్ సీఐ ప్రసాద్ రావు, రామగిరి ఎస్ఐ శ్రీనివాస్, దివ్య, కమాన్‌పూర్ ఎస్ఐ ప్రసాద్, ముత్తారం ఎస్ఐ రవికుమార్ తదితరులు దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు పెంచికల్పేట్ ఎక్స్‌రోడ్డు వద్ద ఐఓసీ పెట్రోల్‌బంక్ సమీపంలో నిందితులు బైక్‌పై వెళ్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
హత్యకు దారితీసిన నేపథ్యం
మృతుడు చిరంజీవి 2019లో భార్య మరణించిన తరువాత ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో నిందితురాలు సంధ్యారాణి ఒకరోజు తన పనిమీద ‘మీ సేవా’ సెంటర్‌కి వెళ్ళి చిరంజీవిని కలిసింది. ఆ పరిచయం తర్వాత చిరంజీవి తరచూ ఆమెకు కాల్స్, మెసేజ్‌లు పంపడం ప్రారంభించాడు. సంధ్యారాణి మాట్లాడకపోతే చంపేస్తాననిబెదిరించడంతో భయపడి ఆమె అతనితో మాట్లాడేది. కాలక్రమేణా చిరంజీవి వేధింపులు పెరగడంతో నిందితురాలు తన భర్తకు విషయం తెలిపింది. అయినా చిరంజీవి ఆగకుండా సంధ్యారాణి కుటుంబాన్ని కూడా బెదిరించాడు. రెండు నెలల క్రితం ఊర్లో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినా, మృతుడి ప్రవర్తనలో మార్పు రాలేదు.
అక్టోబర్ 10న సెంటినరీ కాలనీ సమైక్య కార్యాలయం వద్ద సంధ్యారాణి పనిచేస్తుండగా చిరంజీవి అక్కడికి వెళ్లి ఆమెతో గొడవపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సంధ్యారాణి భర్త, అన్న, తండ్రి, బావమరిది అక్కడికి చేరుకుని చిరంజీవిపై దాడి చేశారు. తండ్రి ఇనుపరాడుతో, చాకుతో దాడి చేయగా ఇతరులు పట్టుకున్నారు. తలపై బలమైన గాయాలతో చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. గోదావరిఖని ఏసీపీ రమేష్ మాట్లాడుతూ మృతుడిపై వ్యక్తిగత ద్వేషం, వేధింపుల కారణంగా హత్య జరిగినట్లు దర్యాప్తులో బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకుని ఈరోజు రిమాండ్‌కు తరలించామని తెలిపారు.