పెద్దపల్లి, జూన్ 11 (నమస్తే తెలంగాణ): సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ మంచినీటి కోసం అల్లాడున్నది. తలాపునే మానేరు ప్రవహిస్తున్నా బిందెడు నీటిని వాడుకోలేని దుస్థితిలో మగ్గుతున్నది. ప్రజల కనీస అవసరాల కోసం గత ప్రభుత్వ హయాంలో అప్పటి సర్పంచ్ ప్రత్యేక చొరవ చూపి మానేరు తీరంలో ప్రత్యేకంగా బావిని తవ్వి, ట్యాంకులను నిర్మించి పైప్లైన్లు ఏర్పాటు చేయగా, ఇన్నాళ్లూ నీటికి ఢోకా లేకుండా పోయింది. అయితే అధికారుల నిర్లక్ష్యం, పంచాయతీలో నిధుల లేమితో నీటి సరఫరా పథకం మూలకుపడింది.
విద్యుత్ బిల్లులు దాదాపు 60వేల నుంచి 70వేల దాకా పేరుకుపోవడం, మరోవైపు విద్యుత్ వైరు కాలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. మరమ్మతులు చేయించేవారు లేక, బకాయిపడ్డ బిల్లు చెల్లించేందులు నిధులు లేక 20 రోజులుగా సరఫరా నిలిచిపోగా, ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. ఇటీవల గ్రామం పరిధిలోని గొల్లపల్లెలో బీరయ్య పండుగ, ఖాసీంపల్లిలో బక్రీద్ పండుగ జరిగిన సందర్భాల్లో పెద్ద సంఖ్యలో బంధువులు రాగా, నీళ్లు సరిపోక అవస్థలు పడ్డారు.
అయితే ఇంటింటికీ మిషన్ భగీరథ కనెక్షన్ ఉన్నా రెండు, మూడు బిందెలే నీళ్లు వస్తుండడంతో సరిపోవడం లేదని, ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి మానేరు నుంచి నీటి సరఫరా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారు. లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి వినోద్ కృష్ణను సంప్రదించగా, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే విద్యుత్ బిల్లులు చెల్లించి, వైరు మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పారు.
పండుగ పూట గోసపడ్డం
వాగు నీళ్లు రాక మాకు పరేషానైతంది. బక్రీద్ పండుగప్పుడు చుట్టాలందరు ఇంటికచ్చె. నీళ్లు లేక మస్తు గోసపడ్డం. నాయకులు ఓట్లప్పుడు మాత్రం అత్తరు. ఓట్లెయ్యి మంటరు. తర్వాత పత్తాలేకుండా పోతరు. నీళ్లు రాక ఇరువై రోజులైనా మా సమస్యను పట్టించుకుంటలేరు.
-హసీనా బేగం, ఖాసింపల్లి (కదంబాపూర్)
నీళ్లకు చానా గోసైతంది
కేసీఆర్ సార్ దయ వల్ల మిషిని భగీరథ నీళ్లు మా అత్తన్నయి. కానీ, అవి తాగేతందుకే అయితన్నయి. మొన్నటిదాకా ఈ వాగు నుంచి మాకు బొచ్చెడు నీళ్లు అచ్చేది. దానికి పైసలు గట్టక అత్తలెవ్వట. నీళ్లకు చానా గోసైతంది. ఎటుజేసైనా నీళ్లియ్యాలె.
– వాహెదా బేగం, ఖాసింపల్లి (కదంబాపూర్)
బాయిల పొంట తిరుగుడైతంది
వాగు నీళ్లు రాక నీళ్లకు బాగ తిప్పలైతంది. తెల్లారితే పొద్దుగూకితే బిందెలు వట్టుకొని బాయిలపొంట, పొలాల్ల ఉన్న బోర్లపొంట తిరుగుడైతంది. వెంటనే మాకు ఈ నీళ్లిప్పియ్యాలే. లేకపోతే బాగ గొడువజేత్తం. సర్కార్ పట్టిచ్చుకోవాలే.
– బీబీ, ఖాసింపల్లి (కదంబాపూర్)