కరీంనగర్ విద్యానగర్, అక్టోబర్ 7: డ్రగ్ కంట్రోల్ శాఖకు చెందిన అవినీతి చేపలు ఏసీబీకి చిక్కాయి. ప్రైవేట్ హాస్పిటల్లో ఫార్మసీ లైసెన్స్ రెన్యూవల్ కోసం నిర్వాహకుడిని 20వేల లంచం డిమాండ్ చేసి, ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా తీసుకుంటుండగా మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాయి. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఫార్మసీ లైసెన్స్ రెన్యూవల్ కోసం నిర్వాహకుడు కరీంనగర్‌లోని డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయ అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు.
అయితే రెన్యూవల్ చేసేందుకు ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మరియాల శ్రీనివాసులు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కార్తీక్ భరద్వాజ్ కలిసి ప్రైవేట్ అసిస్టెంట్ పుల్లూరి రాము ద్వారా ఫార్మసీ నిర్వాహకుడిని 20వేలు డిమాండ్ చేశారు. దీంతో నిర్వాహకుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో మంగళవారం మంచిర్యాల చౌరస్తా సమీపంలో ప్రైవేట్ అసిస్టెంట్ రాము ఫార్మసీ నిర్వాహకుడి నుంచి 20వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.