pension money. | ధర్మారం, అక్టోబర్ 10: బంగారు పుస్తెలతాడు ఫోటో తీసి ప్రభుత్వానికి పంపిస్తే వెంటనే పింఛన్ డబ్బులు చేతికి వస్తాయని ఓ దుండగుడు మాయ మాటలు చెప్పడంతో వృద్ధురాలి తన మెడలో నుంచి బంగారం పుస్తెలతాడును తీసి ఇవ్వడంతో దానిని కొట్టేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు వేట ప్రారంభించారు. పోలీసులు, బాధితురాలు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్టీసీ బస్టాండ్ రోడ్డులో నివాసం ఉంటున్న శంకరమ్మ శుక్రవారం ఉదయం 8.45 గంటల కూరగాయలు కొనడానికి ఒంటరిగా ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె అంబేద్కర్ చౌరస్తా సమీపానికి చేరుకోగానే ఓ దుండగుడు శంకరమ్మ కు ఎదురైనాడు.
పింఛన్ డబ్బులు ఇప్పిస్తానని ఆ దుండగుడు శంకరమ్మతో మాట్లాడుతుండగా అక్కడ ఓ సెల్ పాయింట్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. తాను గ్రామపంచాయతీ కార్యదర్శిని అని ధర్మారంలో 14 మందికి రెండు నెలల పింఛన్ రూ.4 వేల చొప్పున డబ్బులు వచ్చాయని, అందులో నీ పేరు కూడా ఉందని దుండగుడు సదరు వృద్ధురాలిని మాటల్లో దింపాడు. ఇప్పటికే 7 గురు వృద్ధులకు పింఛన్ డబ్బులు రూ.4 పంపిణీ చేశానని నీ డబ్బులు కూడా ఇస్తానని మాట్లాడుకుంటూ ఆమెను తీసుకెళ్లాడు. అయితే పింఛన్ డబ్బులు గ్రామపంచాయతీకి వస్తాయని అక్కడికి వెళ్లి తెలుసుకుంటానని శంకరమ్మ ఆ దుండగుడితో వాదించింది.
కానీ ఆ వ్యక్తి శంకరమ్మ కు మాయ మాటలు చెప్పుకుంటూ దారిలో నడుస్తూనే వెళ్లారు .సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా పెట్టిన నిబంధనల ప్రకారం పింఛన్ డబ్బులు పొందడానికి మహిళల పుస్తెలతాడు ఫొటో తీసి పంపిస్తే ఆ వెంటనే డబ్బులు వస్తాయని దుండగుడు ఆమెతో చెబుతూ నడుచుకుంటూ వెళ్లాడు. దీంతో ఆ దుండగుడు చెప్పింది నిజమని భావించిన వృద్ధురాలు శంకరమ్మ తన మెడలోని 3 తులాల బంగారు పుస్తెల తాడును తీసి అతడికి అప్పగించింది.
ఐదు నిమిషాలలో పింఛన్ డబ్బులు తీసుకువస్తానని చెప్పి అక్కడ నుంచి కనుమరుగయ్యాడు. బంగారు పుస్తెల తాడు కొట్టేసిన దుండగుడు ఎంతసేపటికి రాకపోవడంతో శంకరమ్మ తను మోసపోయానని తెలుసుకొని చుట్టుపక్కల వారికి చెప్పి రోదించింది. జరిగిన మోసంపై ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో దుండగుడు కొట్టేసిన బంగారు పుస్తెలతాడు రూ.4.50 లక్షల విలువ ఉంటుందని ఈ సంఘటనపై బాధితురాలు శంకరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలు నుంచి ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ ఎం. ప్రవీణ్ కుమార్ దుండగుడిని పట్టుకోవడానికి పోలీస్ సిబ్బందిని రంగంలోకి దించి వేట ప్రారంభించాడు. కాగా పొద్దున్నే ధర్మారం నడిబొడ్డున దుండగుడు సినీ పక్కిలో వృద్ధురాలు నుంచి బంగారు పుస్తెలతాడు కొట్టేయడం సంచలనంగా మారింది. పోలీసులు చౌరస్తాలోని ఓ సెల్ పాయింట్ సీసీ ఫుటేజిని పరిశీలించగా వృద్ధురాలు శంకరమ్మతో దుండగుడు మాట్లాడిన దృశ్యం రికార్డు అయింది. ఈ దృశ్యం పోలీసుల చేతికి చిక్కడంతో దుండగుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.