Odela | ఓదెల, జులై 25 : ఆధునిక పోకడల వల్ల తెలుగు సాంప్రదాయాలు ఒక్కొక్కటి కనుమరుగవుతూ వస్తున్నాయి. అందులో పండగల సమయంలో ఇంటిముందు గోడలకు జాజు రాసి తెల్లటి రంగులతో తీనెలు తీయడం ఒకటి. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ తర్వాత తొలిసారి వచ్చే ఏకాదశి పండుగను ప్రజలు తెలుగు సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడే విధంగా వేడుకలను జరుపుకుంటారు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో మొదటిది అత్యంత శ్రేష్టమైనది కావడంతో ప్రజలు తొలి ఏకాదశి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు.
ఇందుకు ఇండ్ల ముందు గోడలకు జాజు కలరు రాసి దాని మీద తెల్ల రంగులో తీనెలు తీయడం ద్వారా పండగలకు సాంకేతం. అయితే ఈ సంస్కృతి, సాంప్రదాయం చాలా వరకు కనుమరుగవుతుంది. పట్టణాల్లో తీనెలు తీసే పద్ధతికి స్వస్తి పలకగా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది. వెనకటి రోజుల్లో గుడిసెలు, పెంకుటిల్లు ఇంటి దర్వాజాకు ముందు గోడలపై జాజురాసి తెల్లటి రంగుతో తీనెలు తీసి పండుగ వాతావరణం నెలకొల్పేవారు. అలాంటి పరిస్థితులు గ్రామాల్లో సైతం ఇప్పుడు కనిపించకుండా పోతున్నాయి. ఈ తరం పిల్లలకు తీనెలు తీసే సాంప్రదాయం తెలియకుండా పోతుంది. కాగా శనివారం తొలి ఏకాదశి పండుగ సందర్భంగా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో పెంకుటిల్లు ముందు గోడకు ఓ మహిళ తీనెలు తీస్తూ పండగ వాతావరణాన్ని ఇలా నెలకొల్పింది.