Unstoppable flood | కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 16 : బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలపడటంతో గత 16 గంటలుగా జిల్లాను ముసురువాన ముంచెత్తుతున్నది. ఎడతెరిపి లేకుండా పడుతున్న ముసురుతో జిల్లావ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. శుక్రవారం రాత్రి మొదలైన ఈ ముసురు శనివారం మధ్యాహ్నం వరకు కూడా కొనసాగుతూనే ఉన్నది. ముసురు వానలతో ఏర్పడే సమస్యల నేపథ్యంలో ముందస్తు అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. వర్షాల మూలంగా ఎదురయ్యే ఇబ్బందులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు నిరంతరాయంగా అధికారులు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. వాయుగుండం నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోవడముపై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నా, వర్షాల తీరుపైనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎడతెరిపి లేకుండా ముసురు పడుతున్నా వరద మాత్రం లేకపోవటంతో, నీటి వనరుల్లో నీరు లేక వెలవెలబోతున్నాయి.
సాధారణ వర్షపాతమే నమోదు
గత నాలుగు రోజులుగా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసిన సాధారణ వర్షపాతమే నమోదవుతున్నది. ఇప్పటివరకు కేవలం 26.5 మిల్లీమీటర్ల మాత్రమే అధికంగా వర్షం పడగా, గంగాధర, రామడుగు మండలాల్లో ఇంకా లోటు వర్షపాతమే నమోదైనట్లు, ఈనెల 13 న అధికారులు విడుదల చేసిన వర్షపాత నమోదు నివేదిక ద్వారా స్పష్టమవుతున్నది. శంకరపట్నం, సైదాపూర్, చిగురుమామిడి, తిమ్మాపూర్, మానకొండూరు మండలాల్లో మాత్రమే అధికంగా, మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతమే నమోదైంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 454.4మీ.మీ వర్షం కురవాల్సి ఉండగా, 480.9 మీ.మీ. కురిసింది. కాగా, గతేడాది ఇప్పటివరకు 600.2 మీ.మీ. వర్షపాతం నమోదైంది. ఈసారి ఇంకా 189.3 మీ.మీ తక్కువ వర్షం కురవగా, ఈ దఫాలోనైనా ఆశించిన మేర వర్షాలు కురుస్తాయా? లేదా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో జమ్మికుంట ప్రాంతంలో 27.5 మి.మీ, ఇల్లందకుంట ప్రాంతంలో 18 మీ.మీ., వీణవంకలో 15.మీ.మీ, మానకొండూరు శంకరపట్నం పల్లి మండలాల్లో 11 మీ.మీల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో పది మిల్లీమీటర్లకు మించలేదు. దీంతో, ఈ వర్షాకాలంలో చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్ లలోకి నీరు చేరటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న నీటి వనరుల పరిస్థితే ఇలా ఉంటే, జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లోకి నీరు చేరటం గగణకుసుమంగా భావిస్తున్నారు. వాస్తవానికి గతేడాది ఆగస్టు మొదటి వారం వరకే జిల్లాలోని నీటి వనరుల్లోకి సమృద్ధిగా నీరు చేరింది. ఈసారి మాత్రం సాధారణ పరిస్థితులు కూడా కనిపించకపోవడంతో పంటలకు నీరందడంపై చర్చ మొదలైంది.
20 శాతం కూడా చేరలే..
జిల్లాలో చిన్న నీటి వనరులు, కుంటలు, చెక్ డ్యాములు మొత్తం కలిపి 1397 ఉండగా, వీటిలో కనీసం 20 శాతం కూడా నీరు చేరలేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో తెలంగాణ జీవనాడి అయిన కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి వర్షాలతో సంబంధం లేకుండా ఏటా రెండు సార్లు నీటిని ఎత్తిపోసేవారు. జిల్లాలోని సాగునీటి వనరులన్నీ సకాలంలో నింపటంతో నిండుకుండలను తలపించేవి. దీంతో జిల్లా ప్రజానీకం వర్షాలకు ఎదురు చూడకుండా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యేవారు. ప్రస్తుత ప్రభుత్వం కనబరుస్తున్న నిర్లక్ష్య ధోరణితో, పరిస్థితులు తలకిందులు కాగా వర్షాలు కురుస్తున్నా నీటి ఎద్దడి తప్పేలా లేదనే భావన ప్రజానీకంలో నెలకొన్నది.