Karimnagar | కమాన్ చౌరస్తా, మార్చి 17 : ప్రతీ వ్యక్తి ఉజ్వల భవిష్యత్‌కు క్రమశిక్షణ అనబడే గట్టి పునాది పడాలని, టీనేజీలో స్వయం నియంత్రణను కలిగి మంచి అలవాట్లతో ముందుకు సాగితే లక్ష్యాన్ని సులభంగా చేరవచ్చని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, రచయిత, విశ్రాంత ప్రిన్సిపాల్ లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు. భగత్ నగర్ సిద్ధార్థ హైస్కూల్ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కౌమార యువతలో మనసు చంచలంగా ఉంటుందని, ఈ దశలో తమను తాము నిగ్రహించుకొని సన్మార్గంలో నడిచిన వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు. పాఠశాల యువత భావోద్వేగాలను నియంత్రించేందుకు తల్లిదండ్రులు, టీచర్స్ సలహాలు పాటించాలని అన్నారు. మన ఉత్తమ జీవనశైలి, మహోన్నత అలవాట్లు మాత్రమే మనల్ని ఆశించిన తీరాలకు చేర్చుతాయని తెలిపారు. పరీక్షల్లో ఉన్నత ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని, ఈ పరీక్షల ఫలితాలు జీవితంలో అంతిమ ఫలితాలు కావని తెలుసుకొని దినదినం అభివృద్ధి పథంలో పయనించాలని పిలుపునిచ్చారు.
సభాధ్యక్షత వహించిన సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ అనేది మాత్రమే ఎంచుకున్న లక్ష్యాలను సుసాధ్యం చేస్తుందని తెలిపారు. అంతర్జాతీయ లయన్స్ సంస్థ నిర్వహించిన లయన్స్ క్వెస్ట్ బోధనలు కౌమార దశ యువతకు ఎంతగానో దోహదపడ్డాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్వెస్ట్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని మానసతో పాటు 160 మంది విద్యార్థులు పాల్గొన్నారు.