హుజూరాబాద్ రూరల్, డిసెంబర్ 5: సారవంతమైన నేలల్లోనే అధిక దిగుబడి సాధించవచ్చని, మృత్తికను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని హుజూరాబాద్ ఏడీఏ సునీత, ఏవో సునీల్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం నేల దినోత్సవం సందర్భంగా మండలంలోని క్లస్టర్లలో వేర్వేరుగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భూసారాన్ని పెంచుకోవడం కోసం జీవ ఎరువులైన పీఎస్బీని వాడుకోవాలని సూచించారు. అలాగే భూసార పరీక్ష కోసం మట్టిని సేకరించే విధానం, తదితర అంశాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఏఈవోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందకుంటలో..
ఇల్లందకుంట, డిసెంబర్ 5: రైతులు ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు చేయించుకోవాలని ఏవో గుర్రం రజిత సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రపంచ నేల దినోత్సవాన్ని నిర్వహించారు. పీఏసీఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆత్మ ఏటీఎం స్రవంతితో కలిసి ఏవో భూసార పరీక్షలు, భూమి ఆరోగ్య పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఇక్కడ టేకుర్తి సర్పంచ్ వాసు, ఆర్బీఎస్ సభ్యుడు ఎం శ్రీనివాస్, ఏఈవోలు తిరుపతి, సంపత్, మౌనిక, రాకేశ్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.
సైదాపూర్‌లో..
సైదాపూర్, డిసెంబర్ 5: మండల కేంద్రంలోని సైదాపూర్, వెన్నంపల్లి, గొడిశాల, దుద్దనపల్లి రైతు వేదికల్లో సోమవారం ప్రపంచ నేలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు నీటి సంరక్షణ వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు నేలల వినియోగం, వివిధ రకాల పంటల యాజమాన్య పద్ధతులను వివరించారు. సైదాపూర్‌లో రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, రైతుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నదని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏవో వైదేహి, సర్పంచ్ కొండ గణేశ్, ఇన్చార్జి సర్పంచ్ మొలుగూరి చిరంజీవి, ఆర్బీఎస్ మండల సభ్యుడు ఏశిక ఐలయ్య, గ్రామ కోఆర్డినేటర్లు పరుకాల నారాయణ, దుంపేటి రమణాచారి, పశువైద్యాధికారులు విజేందర్‌రావు, విజేందర్, ఏఈవోలు నిఖిల్‌కుమార్, రజిత, తిరుపతి, ఎంపీటీసీ ఓదెలు, కార్యదర్శి పోరెడ్డి నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వీణవంకలో..
వీణవంక, డిసెంబర్ 5: రైతులు పంటల సాగుకు ఆధారమైన మృత్తికను సంరక్షించుకోవాలని బీటీఎం శ్రీవిద్య సూచించారు. ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో రైతులకు అవగాహన కల్పించారు. నేల సారవంతం వల్ల కలిగే లాభాలు, మోతాదుకు మించి రసాయనాలు వాడడం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వోరెం భానుచందర్, ఏఈవో మమత, రైతులు నీల పున్నం, చందర్, కొమురయ్య, నాగరాజ్, మొండయ్య, రాజయ్య, సారయ్య తదితరులు పాల్గొన్నారు.
వావిలాలలో..
జమ్మికుంట రూరల్, డిసెంబర్ 5: నేల సారవంతంగా ఉంటేనే అధిక దిగుబడి వస్తుందని ఏఈవో సతీశ్ తెలిపారు. సోమవారం మండలంలోని వావిలాల రైతు వేదికలో ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఈవో నేల ఆరోగ్యాన్ని కాపాడుకునే పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పొల్సాని తిరుపతిరావు, ఆర్బీఎస్ కమిటీ సభ్యులు సదానందం, సంపత్, మహేంద్రాచారితో పాటు రైతులు పాల్గొన్నారు.