Grand farewell | ఓదెల, సెప్టెంబర్ 3: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తించిన ఎండీ రజాక్ మియాకు విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఉపాధ్యాయుడు దంపతులను ఎడ్లబండి ఎక్కించి విద్యార్థులు తాడుతో లాగుతూ గ్రామంలో ఊరేగించి పూల వర్షంతో ఘనంగా వీడ్కోలు తెలిపారు.
రజాక్ మియా ఇక్కడ 2015 నుండి 2025 ఆగస్టు 31 వరకు పది సంవత్సరాలపాటు పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. వీడ్కోలు సభలో మాట్లాడిన తోటి ఉపాధ్యాయులు, గ్రామ నాయకులు గురువు అనేది ఒక దీపస్తంభంలాంటిదని, తన కాంతితో అనేక జీవితాలను వెలిగిస్తాడని, రజాక్ మియా సేవలు భవిష్యత్ తరాలకూ స్ఫూర్తి అని కొనియాడారు.
ఆయనను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో ఓదెల, ఎలిగేడు ఎంఈఓ లు రమేష్, నరేంద్రా చారి, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు, పాఠశాల ఉపాధ్యాయలు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.