శంకరపట్నం, మార్చి 5 : మండలంలోని కరీంపేట్లో అనుమతులు లేవని ఓ ఇంటిని కూల్చేందుకు మంగళవారం అధికారులు రాగా, కుటుంబ సభ్యుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంపేట్‌కు చెందిన అంకతి రాజయ్య కుటుంబ సభ్యులు మూడేళ్ల కిందట గ్రామంలోని తమ ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు వేసుకున్నారు. కాగా, ఇంటి నిర్మాణానికి అనుమతులు లేవని డీపీవో రవీందర్ ఆ ఇంటిని కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేశారు.
దీంతో గ్రామ ప్రత్యేకాధికారి, తహసీల్దార్ అనుపమ, ఎంపీవో బషీరుద్దీన్, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ పోలీసు ఫోర్స్‌తో మంగళవారం ఇంటిని కూల్చేందుకు ఎక్స్‌కవేటర్‌తో వచ్చారు. ఈ క్రమంలో అధికారులు ఆ ఇంటి కుటుంబ సభ్యులను బయటకు వెళ్లాలని ఆదేశించారు. అయితే రాజయ్య, అతడి సోదరులు, మరికొందరు అక్కడకు చేరుకుని ససేమిరా అనడంతో పోలీసులు ఇంట్లో ఉన్న మహిళలను బలవంతంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో అదే కుటుంబానికి చెందిన యువకుడు ఐలయ్య ఎదురుగా నిర్మాణంలో ఉన్న ఇంటి డాబా పైకి పురుగుల మందు డబ్బాతో ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అందరూ ఆ యువకుడికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తాము తమ స్థలంలోనే ఇల్లు నిర్మించుకున్నామని, అప్పటి సర్పంచ్ సరైన పత్రాలు లేవనే సాకుతో నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని అంకతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో డీపీవో రవీందర్ స్వయంగా గ్రామానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు.
జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ గాండ్ల తిరుపతయ్య, దళిత సంఘాల నాయకులు సముద్రాల సంపత్, మేరుగు శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. కొందరు రాజకీయ నాయకుల కక్ష సాధింపు చర్యల వల్లే అధికారులు రాజయ్య కుటుంబం నిర్మించుకున్న షెడ్డును కూల్చేందుకు సిద్ధపడ్డారని ఆరోపించారు. వారికి కొంత గడువు ఇవ్వాలని జడ్పీటీసీ కోరడంతో తహసీల్దార్ నాలుగు రోజులు గడువు ఇచ్చి స్వచ్ఛందంగా ఇంటిని తొలగించుకోవాలని ఆదేశించారు. దీంతో ఐలయ్య కిందికి దిగి వచ్చాడు.