ఒక డాక్టర్ కావాలంటే ఎంత కష్టమో.. ఆర్థిక స్థోమత లేని వారికి తమ పిల్లలను మెడిసిన్ చదివించాలంటే కూడా అంతే కష్టం. అందులోనూ వెనకా ముందు ఎలాంటి ఆస్తులూ లేని దళిత కుటుంబాలకైతే పగటికలే. అందుకు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి రావడమే కారణం. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెడిసిన్ సీటు సాధించిన విమ్మడి దీక్షత కుటుంబ పరిస్థితి కూడా అలాంటిదే. ఫ్రీ సీటు వస్తేనే మెడిసిన్ చదివే పరిస్థితులు ఉండగా, దీక్షిత పట్టుదలతో చదివి రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా జనరల్ కేటగిరీలోనే ఉచిత సీటు సాధించింది. ఇప్పుడు కరీంనగర్ మెడికల్ కాలేజీలోనే సీటు రావడంతో.. ఉన్న ఊళ్లోనే మెడిసిన్ చదివే అవకాశం వచ్చిందని సంతోషపడుతున్నది. ఇదంతా సీఎం కేసీఆర్ చొరవతోనే సాధ్యమైందని ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలుపుతున్నది.
– కరీంనగర్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్
కరీంనగర్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్ : విమ్మరి దీక్షిత కుటుంబ పరిస్థితి అంతంతే. ఆమె తండ్రి పోచయ్య రిటైర్డ్ ఓ చిరుద్యోగి. తల్లి జయశీల కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో నర్సు. వీరికి బిడ్డతోపాటు కొడుకు అనిరుద్ ఉన్నాడు. ఈ ఇద్దరి పిల్లలను చదివించడం, కుటుంబాన్ని పోషించడానికే వేతనాలు సరిపోయేవి. తండ్రి పోచయ్య చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించాడు. పెగడపల్లి మండలం బతికెపల్లికి చెందిన ఆయన 7వ తరగతిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోయి కరీంనగర్‌లోని తన మేనత్త వద్దకు వచ్చి చదువుకున్నాడు. తన అక్కబావల ప్రోత్సాహంతో ఇంటర్ వరకు చదివి, ఐసీడీఎస్‌లో చిరుద్యోగం చేసి ఇటీవలే రిటైర్ అయ్యాడు. దీక్షిత తల్లి జయశీల ప్రభుత్వోద్యోగి అయినా వచ్చే వేతనం కుటుంబ పోషణకే సరిపోయేది.
దళిత కుటుంబం కావడం, వెనకా ముందు ఎలాంటి ఆస్తులూ లేకపోవడంతో పోచయ్య, జయశీల దంపతులు తమ పిల్లలను సాధారణ స్థితిలోనే పెంచుతూ వచ్చారు. ఇప్పుడు దీక్షిత నీట్ రాయడం, రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా జనరల్ కేటగిరీలోనే సీటు సాధించడంతో వారిద్దరూ ఎంతో సంతోషిస్తున్నారు. తమ ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలని వాళ్లు కన్న కలలను తమ గారాల పట్టి దీక్షిత నిజం చేస్తున్నదని గర్వంగా చెప్పుకుంటున్నారు.
ప్రతిభ చాటిన దీక్షిత
దీక్షిత చిన్నప్పటి నుంచే చదువులో అత్యంత ప్రతిభ చూపేది. ఏ విషయం చెప్పినా ఒక్కసారికే అర్థం చేసుకుని తిరిగి చెప్పేది. ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో సైతం ముందుండేది. అన్నింటికీ మించి జనరల్ నాలెడ్జ్‌లో మంచి ప్రతిభ చూపేది. ఇవన్నీ ఒకెత్తయితే.. దీక్షితకు టెన్త్‌లో వచ్చిన మార్కులు చూసిన తండ్రి పోచయ్య తన బిడ్డను డాక్టర్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకు తగినట్టుగానే ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చారు.
శిశు నుంచి టెన్త్ వరకు కరీంనగర్ జ్యోతినగర్‌లోని యూనియన్ స్కూల్లో చదివించిగా, ఇంటర్ మాత్రం హైదరాబాద్‌లోని శ్రీచైతన్యలో చదివించారు. నీట్ కోసం లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించగా మంచి మార్కులతో మెరిట్ ర్యాంక్‌తో ఫ్రీ సీటు సాధించింది. అందులోనూ ఉన్న ఊళ్లో అంటే కరీంనగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు రావడంతో దీక్షితతోపాటు ఆమె తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. ఇప్పుడు ఇంటి వద్దే ఉండి తమ కూతురు మెడిసిన్ చదువుతుందని, సీఎం కేసీఆర్ చొరవతోనే తమకింత మంచి అవకాశం దొరికిందని వారు అంటున్నారు.
మా నాన్న నాకు ప్రతీసారి చెప్పేవారు. తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి ఆయన అనుభవించిన ఒంటరి జీవితాన్ని, కష్టపడిన విధానాన్ని నాకు మా తమ్ముడికి చెప్తుండేవారు. తాను ఎక్కువగా చదవని కారణంగా చిన్న ఉద్యోగం మాత్రమే దొరికిందని, మీరు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం దొరుకుతుందని చెప్పేవారు. ఇది మాకెంతో స్ఫూర్తినిచ్చింది. చిన్నప్పటి నుంచి పట్టుదలతో చదివా. ఇంటర్ పూర్తయిన తర్వాత కోచింగ్‌కు వెళ్లే ముందు మా అమ్మానాన్న కూర్చోబెట్టి చెప్పారు. మెడిసిన్ చదవడం అంటే మాటలు కాదు. మన ఆర్థిక పరిస్థితి అందుకు సరిపోదు.
ఫ్రీ సీటు సాధిస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. లేదంటే ఫార్మసీ చదవాల్సి వస్తుందని కూడా చెప్పారు. కోచింగ్ తీసుకునే సమయంలోనే ఈ విషయం నాకు పదే పదే గుర్తుకు వచ్చేది. పట్టుదలతో చదివి నీట్‌కు అటెండ్ అయ్యా. మంచి మార్కులు సాధించా. ఫ్రీ సీటు రావడం.. అందులో ఉన్న ఊరిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రావడంతో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా బాగా చదువుకుని ఎంబీబీఎస్ పూర్తి కాగానే పీజీ కూడా చేస్తా. నాలాంటి పేద విద్యార్థులు, మెడిసిన్ చదవలేరని అనుకునే చాలా మందికి నేను స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నా. భవిష్యత్తులో నాలాంటి పేద విద్యార్థులు మెడిసిన్ లాంటి ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారి కోసం ఫ్రీగా కోచింగ్ ఇప్పించాలని ఉంది. మంచి డాక్టర్నై పేదలకు సేవలందిస్తా.
మా బిడ్డను చూసి గర్వపడుతున్నా
మా బిడ్డ దీక్షత చిన్నప్పటి నుంచి చదువులో మంచి ప్రతిభ చూపేది. టెన్త్ పూర్వవగానే వచ్చిన మార్కులు చూసి ఆశ్చర్యపోయా. ఇంత మంచి మార్కులు సాధించిన నా బిడ్డను చూసి అప్పుడే నిర్ణయించుకున్నా. మా ఇంట్లో కూడా ఒక డాక్టర్ ఉండాలని అనుకున్నా. దీక్షితనే అందుకు సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నా. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి మా అక్కాబావలు, మేనత్త పెంపకంలో పెరిగి, నేను పడిన కష్టాలను మా పిల్లలిద్దరికి ఎప్పుడూ చెప్పేవాన్ని. ఇది వారికి ఒక ప్రేరణలా పనిచేసింది. దీక్షిత పట్టుదల చూసి మా బంధువులంతా మమ్మల్ని అభినందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది.
– విమ్మరి పోచయ్య, దీక్షిత తండ్రి
మా డిపార్ట్మెంట్లో మెచ్చుకుంటున్నరు
మా బిడ్డ మాకు మంచి పేరుతెచ్చింది. మా డిపార్ట్మెంట్లో అందరూ మా బిడ్డను మెచ్చుకుంటున్నరు. నన్ను అభినందిస్తున్నరు. మాలాంటి చిన్న ఉద్యోగుల పిల్లలకు మెడిసిన్ సీటు లభించడం అంటే మామూలు విషయం కాదు. సహచర ఉద్యోగులు ఈ విషయం గుర్తు చేస్తూ నన్ను అభినందిస్తున్న ప్రతీసారి నేను భావోద్వేగానికి గురవుతున్నా. మావారు పిల్లలకు చదువు గురించి ఎంతో గొప్పగా చెప్తారు. ఆయన మాటలే వారిలో ప్రేరణ కలిగించాయి. మాలాంటి చిన్న కుటుంబంలో ఇంత పెద్ద చదువు చదివించడం సాధ్యమయ్యే పనికాదు. ఈ విషయాన్నే దీక్షితకు చెప్పాం. ఆమె కూడా మా పరిస్థితిని అర్థం చేసుకుని పట్టుదలతో చదివి ఫ్రీసీటు సాధించింది. సీఎం కేసీఆర్ సర్ కరీంనగర్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మొదటిసారి మా బిడ్డకు అడ్మిషన్ లభించడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ఇదంతా కేసీఆర్ చొరవగానే చెప్పవచ్చు.
– విమ్మరి జయశీల, దీక్షిత తల్లి