ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 11: బీసీ రిజర్వేషన్ల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నాడని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ ఒక్క పథకాన్ని కూడా పటిష్టంగా కొనసాగించే సామర్థ్యం లేదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో ఇంటింటికీ గ్యారంటీ కార్డులు ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎవరెవరికీ ఎన్ని పథకాల్లో బాకీ ఉన్నారో తెలిపే బాకీ కార్డులపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బాకీ కార్డులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు, మహిళలు, విద్యార్థులు, పెన్షన్‌దారులకు రైతుభరోసా, మహిళలకు నగదు సాయం, విద్యార్థులకు స్కూటీల అందజేత, కల్యాణలక్ష్మి తులం బంగారం వంటి పథకాల్లో ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం ఏమేమి బాకీ ఉందో తెలిపే కార్డుల గురించి ప్రతి కార్యకర్త బాధ్యతగా ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు వచ్చిన సర్వే ప్రకారం 99శాతం బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. జడ్పీటీసీతో పాటు, ఎంపీపీ సీట్లను కైవసం చేసుకుంటున్నామని తెలిపారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినప్పటికీ ఐక్యతతో కలిసి పని చేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక, ఏఎంసీ మాజీ చైర్మన్లు అందె సుభాష్, నాయకులు గుళ్లపల్లి నర్సింహారెడ్డి, కొండ రమేశ్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.