Siricilla | రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 3 : డీడబ్ల్యూఓ–చైల్డ్ ప్రొటెక్షన్ నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ (DWO) శాఖ, చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో జరిగిన నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, జిల్లా అధ్యక్షుడు అజ్జ వేణు మాట్లాడుతూ 2025 నోటిఫికేషన్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఇతర జిల్లాలకు చెందిన, సంబంధిత అనుభవం లేని వ్యక్తులను నియమించారని ఆరోపించారు.
దీంతో గతంలో అనుభవంతో విధులు నిర్వహించిన సిబ్బందికి అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నియామకాల గడువు జూలై 2026తో ముగిసినందున, వారి సేవలను పొడిగించకుండా, 2025కు ముందు విధులు నిర్వహించిన అర్హులైన సిబ్బందిని తిరిగి విధుల్లో కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. నియామక ప్రక్రియపై జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ జరిపి, న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో బొల్లె బాబన్న, పండుగ చంద్రయ్య, తైదల శ్రీను తదితరులు పాల్గొన్నారు.