రాజన్న కోడెలు దుర్వినియోగం అవుతున్నట్టు తెలుస్తున్నది. భక్తులు సమర్పించిన నిజ కోడెలను పక్కదారి పట్టిస్తున్నట్టు వెలుగు చూస్తున్నది. గతంలో గోశాల ఫెడరేషన్ ద్వారా గోశాల నిర్వాహకులకు కోడెలను అందించే విధానం ఉండేది. అయితే, నకిలీ గోశాలల పేరిట కోడెలను తీసుకెళ్లి విక్రయిస్తున్న వ్యవహారం గత జనవరిలో స్టేషన్ ఘన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బయటపడింది. దీంతో అధికారులు మార్చి నుంచి పకాగా వివరాలు తీసుకొని రైతులకు అందిస్తున్నా.. తాజాగా మరోసారి కోడెలు దుర్వినియోగమైనట్టు తెలుస్తుండడం కలకలం రేపుతున్నది.
వేములవాడ, డిసెంబర్ 5 : వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన మాదాసు రాంబాబు వేములవాడ రాజన్న ఆలయ గోశాల నుంచి 60 కోడెలను తెచ్చి, అందులో 49 విక్రయించినట్టు అకడి వీహెచ్‌పీ, బజరంగ్దళ్ నాయకులు నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ తనిఖీ చేసి అందులో 11 కోడెలు మాత్రమే ఉన్నట్లుగా నిర్ధారించినట్లు తెలిసింది.
రాంబాబుకు ఎన్ని కోడెలు కేటాయించారు? ఏ పద్ధతిన కేటాయించారు? ఎంతమందికి ఏ విధంగా ఇచ్చారు? అని పూర్తి వివరాల కోసం రాజన్న ఆలయ అధికారులకు గీసుకొండ పోలీస్ అధికారులు నోటీసు జారీ చేశారు. దీంతో మరోసారి కోడెల దుర్వినియోగం వ్యవహారం వెలుగు చూడడం చర్చనీయాంశంగా మారింది. అయితే పోలీసుల నోటిస్‌పై ఈవో వినోద్‌రెడ్డిని సంప్రదించగా, కోడెల దుర్వినియోగంపై తనకు గీసుకొండ పోలీసుల నుంచి లేఖ వచ్చిందని, రికార్డులు పరిశీలించి సమాచారం అందిస్తానని తెలిపారు. పోలీసుల నిర్ధారణ తర్వాత కేటాయింపు, ఏ మేరకు దుర్వినియోగం అయ్యాయి? స్థానిక ఉద్యోగుల కేమైన సంబంధం ఉన్నదా..? అనే అంశాలు కూడా తేలే అవకాశమున్నది. గతంలో న్యూ స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలో పట్టుబడిన కోడెల విషయంలోనూ రాజన్న ఆలయ ఉద్యోగిపై కేసు నమోదైంది. శాఖా పరమైన చర్యలు కూడా తీసుకున్నారు.