Ramagiri | రామగిరి, జనవరి 20: ‘మూడేండ్ల సంది తన రెక్కల కట్టంతో బతుకుతున్నం.. ఎప్పుడూ ఓ నోరు లేని జీవిగా చూడలె.. మాలో ఒకదానిగా, మా ఇంటి బిడ్డగానే సాకినం.. మా కుటుంబ బరువును మోసింది. ఎండనక.. వాననక పొలం కాడికి నడిచింది. అది కట్టపడితేనే మా ఇంటికి ఇన్ని వడ్లచ్చేది. అది తిన్నా.. తినకున్నా మా కడుపైతే నింపేది. కరెంటోళ్ల నిర్లక్ష్యంతో తను బలైంది.. మా నుంచి శాశ్వతంగా దూరమైంది.’ అంటూ పాడెద్దు మృత్యువాత సంఘటనతో ఓ బాధిత రైతు కన్నీరు మున్నీరవుతోంది.
రామగిరి మండలం కల్వచర్ల గ్రామ శివారులో మంగళవారం కమాన్పూర్ మండలం రాజాపూర్ కు చెందిన గడ్డి ముత్యాలకు చెందిన పాడెద్దు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంటు షాకు తగిలి కుప్పకూలింది. అప్పటికి అలసి పడుకుందనుకున్నం. కానీ ఎంతసేపటికీ లేవకపోవడంతో వెళ్లి చూస్తే కరెంటు షాకు తగిలి చనిపోయిందంటూ ఆ రైతు బోరున విలపించాడు.
స్థానికుల కథనం ప్రకారం.. రాజాపూర్ కు చెందిన గడ్డి ముత్యాల అనే రైతు రూ.90 వేలు పెట్టి మూడేండ్ల క్రితం పాడెద్దును కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకున్నాడు. అప్పటినుంచి ఆ ఎద్దును అల్లారు ముద్దుగా సాకుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం అదే గ్రామానికి చెందిన మరో రైతు పొలం వద్దకు ఎరువుల బస్తాలను జారగొట్టేందుకు తన ఎడ్లబండితో వెళ్లాడు. ఆ పొలం వద్ద ఎడ్ల బండి పక్కన పెట్టి జోడెడ్లను మేతకు వదిలాడు. ఎడ్ల బండి నుంచి ఎరువుల బస్తాలను దించుతుండగా కొద్ది దూరంలో ఓ ఎద్దు కుప్పకూలి ఉంది. అది గమనించిన రైతు ముందుగా నీడకు నిద్ర పోతుందనుకొని ఏమరుపాటులో బండిలో నుంచి ఎరువుల బస్తాలను పూర్తిగా దించాడు. ఆ తర్వాత ఎద్దును లేపడానికి వెళ్లి ప్రయత్నించగా, అక్కడ ప్రమాద భరితంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు కిందకు తీగలు వేలాడి ఉండటం, వాటిని తాకి అది మృత్యువాత పడి ఉండటం చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ట్రాన్స్ఫార్మర్ వద్ద రక్షణ చర్యలు లేకపోవడం వల్లనే తన పాడెద్దు బలైందని బోరునా విలపించాడు.
ఎద్దు మృతితో ఆ రైతు కుటుంబం విషాదంలో మునిగింది. మరో మూగ జీవి బలి గాకుండా విద్యుత్ అధికారులు తక్షణమే అక్కడ రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఘటనపై మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి స్పందించి బాధిత రైతుకు పూర్తి నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యంకు ఇవాళ మూగజీవి బలైందనీ, రేపు ఎవరైనా రైతులకు ప్రమాదం జరిగితే బాధ్యులెవరని ప్రశ్నించారు.