చెత్తశుద్ధి కరువైంది. కరీం‘నగరం’లో ప్రధాన సమస్యగా మారిన డంప్‌యార్డులో బయోమైనింగ్‌కు బ్రేక్ పడింది. ఆటోనగర్ సమీపంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన వేస్టేజీని తొలగించేందుకు గత బీఆర్ఎస్ సర్కారు 16కోట్ల వ్యయంతో శ్రీకారం చుట్టిన చెత్త క్లీనింగ్ ప్రక్రియ అటకెక్కింది. పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడమే అందుకు కారణమని తెలుస్తుండగా, తరచూ అగ్ని ప్రమాదాలు జరిగి వెలువడుతున్న పొగ వాయు కాలుష్యానికి దారి తీస్తున్నది. ఫలితంగా శివారు కాలనీల జనం ఇబ్బందులు పడుతుండగా, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నది.
కార్పొరేషన్, డిసెంబర్ 30 : కరీం‘నగర’ శివారులోని ఆటోనగర్ సమీపంలో తొమ్మిదెకరాల విస్తీర్ణంలో ఉన్న డంప్యార్డుల్లో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన విషయం తెలిసిందే. దీని వల్ల ఏటా వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగడం, ఫలితంగా కాలుష్యం కావడంతోపాటు వచ్చే పొగ మూలంగా సమీపంలోని కాలనీల ప్రజలందరూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాగా, ఈ సమస్యలన్నింటికీ బయోమైనింగ్ ప్లాంట్ల ద్వారా శాశ్వత పరిష్కారం చూపించాలని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రణాళికలు సిద్ధం చేశారు. వచ్చే రెండేండ్లలో బయోమైనింగ్ పద్ధతిలో డంప్‌యార్డులోని చెత్తను క్లీన్ చేయడంతో ఎరువులు తయారు చేయాలని సంకల్పించారు.
అలాగే ఈ స్థలాన్ని ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా అద్భుతంగా తీర్చిదిద్దాలని భావించారు. ఈ క్రమంలో సుమారుగా 16 కోట్ల వ్యయంతో బయోమైనింగ్ చేపట్టేందుకు టెండర్లు పిలిచి, హైదరాబాద్‌కు చెందిన సంస్థకు అప్పగించారు. చెత్తను క్లీన్ చేసేందుకు రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసి పనులు చేస్తామని పేర్కొన్న సంస్థ ప్రతినిధులు, రెండేళ్ల క్రితం ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేసి పనులు ప్రారంభించారు. కానీ కొద్దిరోజులకే పనులు ఆగిపోయాయి. అయితే చేపట్టిన పనులకు గాను పూర్తిస్థాయి బిల్లుల చెల్లించాలని సంబంధిత కాంట్రాక్టు సంస్థ పేర్కొంటుండగా, నగర పాలక సంస్థ పట్టించుకోకపోవడం వల్లే చెత్తశుద్ధి ప్రక్రియ నిలిచిపోయినట్లు తెలుస్తున్నది. కాగా, పనులు చేయని కారణంగా ఇటీవల నగర కమిషనర్ సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. మరి మరోసారి బయోమైనింగ్ ప్రారంభమై డంప్ యార్డు సమస్యకు పరిష్కారం లభిస్తుందా..? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తరచూ మంటలు.. దట్టమైన పొగలు
బయోమైనింగ్ ప్రక్రియ అటకెక్కగా, డంప్‌యార్డులో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూ, రోజుల తరబడి పొగ నగరాన్ని కమ్మేస్తున్నది. క్రమంగా వాయు కాలుష్యానికి దారి తీస్తుండడం, దుర్వాసన వస్తుండడంతో చుట్టు పక్కల కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాజీవ్ రహదారిపై వెళ్లే వాహనదారులు పొగతో నరకం చూస్తున్నారు. రెండ్రోజుల క్రితం భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానిక ప్రజలు భయపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.