కొత్త టీచర్ల రాకతో సర్కారు బడుల్లో కొంతైనా కొరత తీరుతుందని ఆశిస్తున్న తరుణంలో అంతకుమించి రిటైర్మెంట్లు జరుగనుండడం నిరాశకు గురిచేస్తున్నది. తాజా గణాంకాలను చూస్తే.. కొద్ది నెలల్లోనే ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు కొత్త సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తున్నది. ఓవైపు జాయినింగ్, మరోవైపు విరమణతో ఉపాధ్యాయుల పరిస్థితి ‘ఇలా రావడం.. అలా వెళ్లడం’ అన్నట్టు మారుతున్నది.
ప్రస్తుతం 823 మందికి పోస్టింగ్లు ఇవ్వగా.. వచ్చే ఐదు నెలల్లో 1091 మంది ఉపాధ్యాయులు రిటైర్ అయ్యే అవకాశమున్నది. దీంతో కొత్త పోస్టులకు మించి అదనంగా ఖాళీలు ఏర్పడనుండగా, తాజా టీచర్లను కలుపుకొని చూసినా ఇంకా 778 ఎస్జీటీ పోస్టులు ఖాళీగానే ఉండనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం సజావుగా సాగాలంటే కొత్త డీఎస్సీ వేస్తే తప్ప ఉపాధ్యాయుల కొరత తీరదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి ప్రభుత్వం 2024 డీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 11,062 పోస్టుల భర్తీకి సంబంధించి జూలై లో పరీక్షలు నిర్వహించింది. వాటి ఫలితాలు వెల్లడించి, నియామక పత్రాలు అందజేసి ఈనెల 15న పోస్టింగ్లు ఇచ్చింది. వీరంతా తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 823 పోస్టులు భర్తీ అయ్యాయి. స్కూల్ అసిస్టెంట్లు, భాషాపండిత్లు, ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేటర్, పీఈటీలు, స్పెషల్ ఎడ్యుకేటర్ ఎస్జీటీల పోస్టులను డీఎస్సీ ద్వారా ఎంపిక చేసి భర్తీ చేశారు.
ఉమ్మడి జిల్లాలో కొత్త డీఎస్సీ ద్వారా నియమితులైన వారిని చూస్తే.. జగిత్యాల జిల్లా లో 334 మంది, కరీంనగర్లో 245, పెద్దపల్లిలో 93, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 151 మంది ఉన్నారు. వీరికి పోస్టింగ్లు ఇవ్వడంతో చాలామంది బుధవారం విధు ల్లో చేరారు. మరికొంత మంది ఒకటి రెండు రోజుల్లో జాయిన్ కానున్నారు. నిజానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే చాలా బడుల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నది.
ఈ సమస్యను అధిగమించడానికి కొత్త టీచర్లు వచ్చే వరకు విద్యావలంటీర్లను నియమించుకునే అవకాశం కల్పించాలని చాలా పాఠశాలల నుంచి విజ్ఞప్తులు ప్రభుత్వానికి వెళ్లాయి. పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా డిమాండ్ చేశాయి. అయి నా ప్రభుత్వం వలంటీర్ల విషయాన్ని పక్కన పెట్టింది. దీంతో ఉన్న ఉపాధ్యాయులే ఏదో విధంగా నెట్టుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితు ల్లో తాజాగా చేరిన టీచర్ల ద్వారా కొంత మేర కు ఉపశమనం కలిగే అవకా శం ఉన్నా ఇది కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే కనిపిస్తున్నది.
వచ్చే మార్చిలోగా 1091 మంది పదవీ విరమణ
కొత్త ఉపాధ్యాయుల రాకతో సమస్య కొంత మేరకైనా తీరుతుందని భావిస్తున్న తరుణంలో రిటైర్మెంట్లతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తున్నది. పదవీ విరమణ ప్రభావం వచ్చే నెల నుంచే భారీగా పడే అవకాశమున్నది. దీంతో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ‘యథారాజా.. తథా స్థితి’ అన్న చందంగానే ఉండబోతున్నది. వాస్తవానికి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు.. పదవీ విరమణ వయస్సును తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పెంచిన విషయం తెలిసిందే. గతంలో రిటైర్మెంట్ వయసు 58కి ఉండగా, మూడేళ్లు పెంచి 61కి చేసిన విషయం విదితమే.
ఈ ఆదేశాలు 2021 మార్చి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో మూడేళ్లపాటు నిలిచిపోయిన పదవీ విరమణలు తిరిగి గత మార్చి నుంచే ప్రారంభమయ్యాయి. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలోనూ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో రిటైర్ కానున్నారు. వచ్చే నవంబర్, డిసెంబర్లో ప్రతి నెలా సుమారు 160 మందికిపైగా పదవీ విరమణ పొందనున్నారు. అలాగే వచ్చే యేడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఒక్కో నెలలో 180 నుంచి 250కిపైగా మంది రిటైర్ కాబోతున్నారు. మొత్తంగా ఆయా జిల్లాల విద్యాశాఖ నుంచి అందుతున్న గణాంకాల ప్రకారం.. వచ్చే మార్చి నాటికి అంటే దాదాపు ఐదు నెలల్లో 1091 మందికిపైగా రిటైర్మెంట్ అవుతారని స్పష్టమవుతున్నది.
ఇప్పటికే ఎస్జీటీల కొరత
2024 డీఎస్సీ ప్రకారం చూస్తే.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 363 మంది ఎస్జీటీలు నియామకమయ్యారు. ఇవి పోనూ ఉమ్మడి జిల్లాలో ఇంకా 778 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాల వారీగా చూస్తే జగిత్యాల జిల్లాలో 441, కరీంనగర్లో 311, పెద్దపల్లిలో 158, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 231 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు పోస్టులు భర్తీ చేయకపోవడం, మరోవైపు రిటైర్మెంట్లు పెరుగనుండడంతో సర్కారు బడుల్లో మళ్లీ పంతుళ్ల కొరత ఏర్పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విద్యాసంవత్సరం ఏదో రకంగా నెట్టుకొచ్చినా.. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి అంటే జూన్ వరకు టీచర్ల కొరత తీవ్రమవుతుందని ఉపాధ్యాయులే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం ఇచ్చి.. పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తే తప్ప సర్కారు బడుల్లో బోధన అవాంతరాలు తొలగిపోవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే భవిష్యత్లో నిర్వహించే డీఎస్సీలు ఒక వేళ ఆలస్యమయ్యే పరిస్థితులుంటే.. ముందుగా విద్యావలంటీర్లను రిక్రూట్ చేసుకునే అవకాశమిస్తే కొంతలో కొంతైనా సమస్య పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి.
సర్దుబాటుపై దృష్టి అవసరం
ఉమ్మడి జిల్లాలో కొత్తగా 823 మంది టీచర్లు వచ్చినా.. చాలా పాఠశాలల్లో కొరత తీరే పరిస్థితి లేదు. నిజానికి విద్యార్థులున్న చోట ఉపాధ్యాయులు లేకపోవడం, ఉపాధ్యాయులున్న చోట విద్యార్థులు లేకపోవడాన్ని ప్రభుత్వం గుర్తించి గతంలోనే సర్దుబాటుకు అవకాశం కల్పించింది. అయితే ఉమ్మడి జిల్లాలో సర్దుబాటు ప్రక్రియ సజావుగా సాగలేదు. ఆయా జిల్లాల విద్యాశాఖలో పారదర్శకత లోపించడం, అలాగే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం దీనికి ప్రధాన కారణమని తెలుస్తున్నది.
సర్దుబాటు కింద కేటాయించిన పాఠశాలల్లో తక్షణమే విధుల్లో చేరాల్సి ఉన్నా.. చాలా మంది పంతుళ్లు వెళ్లడం లేదు. రాజకీయ అండదండలతో కొంతమంది ముందుకెళ్తుంటే.. అధికారులు సైతం తమకెందుకులే అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా విద్యార్థులున్న స్కూళ్లలో గురువులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ విద్య సజావుగా సాగాలంటే ఇప్పటికైనా సర్దుబాటుపై మరోసారి దృష్టిసారించాల్సిన అవసరముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.