చొప్పదండి, డిసెంబర్ 26: ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నది. మండలంలోని చొప్పదండి సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా వానకాలం, యాసంగి సీజన్లలో రైతాంగం పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. వ్యవసాయ శాఖ అధికారులు చేసిన సూచనలకు అనుగుణంగా వానకాలంలో పండించిన పంటను, కొనుగోలు చేసే ధాన్యాన్ని అంచనాలు వేసి దానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు సహకార సంఘాల అధికారులు వేసుకున్న అంచనాలకు మించి ధాన్యం సేకరించారు.
ఈ సీజన్లో సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన 8 కొనుగోలు కేంద్రాల ద్వారా లక్ష క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యాన్ని పెట్టుకోగా, లక్షా 8వేల 358 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. ముందస్తుగా ఊహించిన దాని కన్నా 8వేల క్వింటాళ్ల ధాన్యం అధికంగా వచ్చినప్పటికీ రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, మిల్లర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహకార సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి ఆదేశాలకనుగుణంగా ఏర్పాట్లు చేసి కొనుగోళ్లు పూర్తిచేశారు. దీనికి సంబంధించి లక్షా7వేల క్వింటాళ్ల ధాన్యం డబ్బులు చెల్లించగా, మిగిలిన డబ్బులను మూడు, నాలుగు రోజుల్లో చెల్లించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కొనుగోళ్లు వేగవంతం
సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 8 కొనుగోలు కేంద్రాలను సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి నిత్యం సందర్శించడంతో కొనుగోళ్లు వేగవంతమయ్యేందుకు మార్గం సులువైందని రైతులు పేర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సమయంలో హమాలీల సమస్య ఉన్నా, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే వాటిని పరిష్కరించడంతో పాటు కొనుగోళ్లు వేగవంతం చేయడంతో రైతులు సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించేందుకు ఆసక్తి చూపారు. దీంతో లక్ష్యానికి మించిన కొనుగోళ్లు చేయడానికి అవకాశం ఏర్పడింది.
వెంట వెంటనే రైస్‌మిల్లులకు…
కొనుగోలుచేసిన వరి ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించడానికి సహకార సంఘం సిబ్బంది కృషిచేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఒక లారీకి సరిపడా ధాన్యం బస్తాలు తూకం పూర్తైన వెంటనే మిల్లులకు తరలించి, ఎప్పటికపుడు ఆన్లైన్లో నమోదుచేశారు. దీంతో ధాన్యం విక్రయించిన రైతులకు బ్యాంకు ఖాతాల్లో సకాలంలో డబ్బులు పడుతున్నాయి. వారం లోపు డబ్బులు ఖాతాలో జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలిగించలేదు
చొప్పదండి సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంఘం డైరెక్టర్లు, సభ్యులు, రైతులు, సిబ్బంది సహకారంతో అంచనాలకు మించి ధాన్యాన్ని సేకరించాం. సిబ్బంది, వ్యవసాయ అధికారులు ముందుగా లక్ష క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించేందుకు ప్రణాళికను రూపొందించాం. అంచనాలకు మించి ధాన్యం రావడంతో ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా వచ్చిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేశాం. లక్ష్యానికి మించి కొనుగోలు చేయడానికి సహకరించిన జిల్లా స్థాయి అధికారులు, రైతులు, సహకార సంఘం పాలకవర్గ సభ్యులు, రైస్ మిల్లర్లు, సిబ్బందికి ధన్యవాదాలు.
– వెల్మమల్లారెడ్డి,విండో చైర్మెన్ ,చొప్పదండి
రూ.22వేల కోట్లు చెల్లింపు
సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన 8 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు నాలుగు రోజుల్లోపు వారి ఖాతాలో పౌరసరఫరాల శాఖ అధికారులు డబ్బులు జమ చేశారు. ఆన్లైన్ చేసిన వెంటనే వారి ఖాతాల్లోకి డబ్బులు జమయ్యాయి. ఇప్పటివరకు సహకార సంఘం ఆధ్వర్యంలోని 8 కొనుగోలు కేంద్రాల ద్వారా లక్షా 8వేల358 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశాం. వీటికి గాను రైతులకు లక్షా7వేల క్వింటాళ్లకు రూ.22కోట్ల 4లక్షల 20వేలు చెల్లింపులు జరిగాయి. మిగితా వారికి వారం రోజుల్లో చెల్లింపులు పూర్తవుతాయి.
– తిరుపతిరెడ్డి, సహకార సంఘం కార్యదర్శి