ఫర్టిలైజర్‌సిటీ, డిసెంబర్ 28 : ఆన్లైన్ యాప్‌లో డబ్బులు పెడితే భారీగా ప్రాఫిట్ వస్తుందని ఓ ప్రభుత్వోద్యోగిని నమ్మించి.. నిండా ముంచాడో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్. తనకున్న పాత పరిచయంతో కోటి 37 లక్షలకు టోకరా వేసి మోసగించాడు. ఈ నెల 24న బాధితుడు గోదావరిఖని సైబర్‌క్రైంలో ఫిర్యాదు చేయగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు, శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో, డీఎస్పీ ఎం వెంకటరమణ, ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
రామగుండం ప్రాంతానికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ అబ్దుల్ నయీం.. ఓ ప్రభుత్వోద్యోగితో తనకున్న పరిచయాన్ని ఆసరాగా చేసుకున్నాడు. తాను డఫాబెట్ (డీఏఎఫ్ఏబీఈటీ) ఆన్లైన్ యాప్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నానని, నీవు కూడా ఇన్వెస్ట్ చేస్తే పెద్ద మొత్తంలో ప్రాఫిట్ వస్తుందని నమ్మించాడు. సదరు ఉద్యోగి నుంచి దఫదఫాలుగా డబ్బులు తీసుకున్నాడు. ఆ యాప్‌లో పెట్టుబడి పెట్టడంతోపాటు తన అవసరాలకు కూడా వాడుకున్నాడు. అలాగే, షేర్ మార్కెట్లో కూడా భారీగా లాభాలు వస్తాయని డబ్బులు తీసుకుని మోసగించాడు. ఇలా మొత్తం కోటి 36 లక్షల 96వేల 290 తీసుకున్నాడు. తర్వాత డబ్బులు ఇవ్వకపోవడంతో సదరు ప్రభుత్వోద్యోగి మోసపోయానని గ్రహించి మంగళవారం గోదావరిఖని సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, శనివారం నిందితుడు అబ్దుల్ నయీంను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈజీగా డబ్బులు వస్తాయనే ఆశతో ఆన్లైన్ గేమ్స్, షేర్ మార్కెట్‌ను నమ్మి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.