కరీంనగర్ కలెక్టరేట్, జనవరి 7: కరీం‘నగరం’లోని శర్మనగర్ మహాత్మాజ్యోతిబాఫూలే బాలికల గురుకులంలో సోమవారం రాత్రి పుడ్ పాయిజన్తో 31 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో అర్ధరాత్రి నుంచే బాధపడుతుండగా, వసతి గృహ అధికారి, సిబ్బంది వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయించారు.
విషయం తెలిసిన తల్లిదండ్రులు ఆందోళనకు గురై, రోదిస్తూ దవాఖానకు చేరుకున్నారు. చికిత్స అనంతరం పిల్లలు కోలుకోవడం, ప్రమాదం ఏమీ లేదని వైద్యులు ప్రకటించడంతో తల్లిదండ్రులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం కల్లా విద్యార్థినులను హాస్టల్కు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అస్వస్థతకు గురైన వారికి అనారోగ్య సెలవులు ఇచ్చి, ఇండ్లకు పంపించారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు గురుకులం ఎదుట ఆందోళన చేశారు.