సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 30: అఘాయిత్యానికి గురైన ఆరేండ్ల చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ ఇన్చార్జి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య భరోసానిచ్చారు. ఎల్లారెడ్డిపేట మం డలం అల్మాస్‌పూర్‌కు చెందిన రాధారపు శంకర్ చిన్నారిపై లైంగికదాడికి పాల్పడడం అమానుష చర్యగా అభివర్ణించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ ఆదేశాల మేరకు శంకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. టీఆర్ఎస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, తప్పు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే శంకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, పదవి నుంచి తొలగించామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఈ సంఘటనను రాజకీయం చేయడం సరికాదన్నారు. జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ చిన్నారిపై ఇలాంటి ఘటన జరుగడం విచారకరమన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, గ్రంథాలయ జిల్లా చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, ఎంపీపీలు మాలోతు భూళ, పిల్లి రేణుక, జడ్పీటీసీ గుగులోతు కళావతి, బంజారా సేవాలాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోతు సురేశ్‌నాయక్, న్యాలకొండ రాఘవరెడ్డి, కమ్మరి రాజారాం, కుంబాల మల్లారెడ్డి, ఇల్లందుల శ్రీనివాస్‌రెడ్డి, గిరిజన సంఘం నాయకులు రాజునాయక్, తిరుపతినాయక్, ప్రభునాయక్, కళ్యాణ్‌నాయక్ ఉన్నారు.
దవాఖానకు వెళ్లి బాధితులకు పరామర్శ
రాజన్నసిరిసిల్ల జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న చిన్నారిని, వారి తల్లిదండ్రులను బస్వరాజు సారయ్య పరామర్శించారు. వారి కుటుంబ పరిస్థితిని అడిగితెలుసుకొన్నారు. అన్నివిధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ సంఘటన దురదృష్టకరమని పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు, పోలీసులను కోరామని చెప్పారు.
జిల్లా కేంద్రంలో ఆందోళన..
చిన్నారిపై అఘాయిత్యం చేసిన రాధారపు శంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తావద్ద ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిందితుడిని శిక్షించి తమ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీరికి గిరిజన సంఘం నేతలు, బీజేపీ, కాంగ్రెస్, మాల, మాదిగల ఐక్య సమితి నాయకులు సంఘీభావం ప్రకటించారు. మంత్రి కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. లక్ష ఆర్థిక సాయం, డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.