రూ.1.30 కోట్లతో నిర్మాణం
తీరనున్న ఓవర్‌లోడ్ సమస్య
నగరంలో మూడు సబ్స్టేషన్లపై తగ్గనున్న భారం
త్వరగా వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు
ముకరంపుర, జనవరి 30: రాష్ట్రంలో విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. ముఖ్యంగా స్మార్ట్‌సిటీగా ప్రత్యేకతను పొందిన కరీం‘నగరం’లో ప్రజల వినియోగానికి అనుగుణంగా సరఫరాలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు చేపట్టింది. డొమెస్టిక్‌తో పాటు కమర్షియల్ పరంగా ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది. రాబోయే రోజుల్లో మరింత పెరుగనుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ సిటీలో ఇప్పుడున్న సబ్స్టేషన్ల ద్వారా సరఫరాలో సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని ఆర్అండ్బీ క్వార్టర్స్ ప్రాంతంలో కేటాయించిన స్థలంలో కొత్తగా మరో 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మిస్తున్నారు. త్వరగా పనులు పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేలా అధికారులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షణ చేస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి రానున్న సబ్‌స్టేషన్‌తో నగరంలో ఇప్పటికే ఉన్న పలు సబ్స్టేషన్లకు రిలీఫ్ లభించనుంది. ఫీడర్లపై ఓవర్‌లోడ్ భారం తప్పనుంది. వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరాకు మార్గం సుగమం కానుంది. ప్రజలకు మెరుగైన సేవలతో మరింత ప్రయోజనం కలుగనుంది.
వేగంగా నిర్మాణం
నగరంలో రూ.1.30 కోట్లతో చేపట్టిన కొత్త సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయి. 33 కేవీ టవర్, 11కేవీ ఇంటర్నల్ లైన్లతో పాటు పీటీఆర్లు బిగించాల్సి ఉంది. మిగతా పనులు త్వరగా పూర్తి చేసి వచ్చే నెలలో వినియోగంలోకి తెచ్చేలా అధికారులు ముందుకు సాగుతున్నారు.
మూడు సబ్స్టేషన్లపై తగ్గనున్న భారం
నగరంలోని బ్యాంక్ కాలనీతో పాటు వావిలాలపల్లె, సీతారాంపూర్, ఆరెపల్లి రోడ్డులోని ప్రాంతాలన్నీ ఇప్పటికే అభివృద్ధి చెందాయి. వాణిజ్య సంస్థల సముదాయాలు, మాల్స్, విద్యా సంస్థలతో పాటు కాలనీలు విస్తరించి ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంది. ఈ ఏరియాకు విద్యుత్ సరఫరా చేసే వావిలాలపల్లె, రేకుర్తి, ఎస్సారార్ కాలేజీ 33/11కేవీ సబ్ స్టేషన్లలోని ఫీడర్లపై ఓవర్‌లోడ్ ఎక్కువగా పడుతున్నది. వేసవిలో సమస్య మరింత తీవ్రంగా ఉంటున్నది. కాగా, కొత్త సబ్‌స్టేషన్ నిర్మాణంతో సుమారు 6 ఫీడర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా సుమారు 8 వేల సర్వీసులకు నాణ్యమైన నిరంతర విద్యుత్‌ను అందించే వెసులుబాటు ఏర్పడుతుంది. ఏ సమస్య వచ్చినా సరఫరాకు ఇబ్బంది లేకుండా అధికారులు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వావిలాలపల్లె, ఎస్సారార్ కాలేజీ, రేకుర్తి 33/11కేవీ సబ్స్టేషన్లపై భారం తగ్గుతుంది. సుమారు నాలుగు ఫీడర్లకు రిలీఫ్ లభించనున్నది. నగరంలో కొత్తగా నిర్మిస్తున్న 33/11కేవీ సబ్‌స్టేషన్‌తో కలిపి సబ్స్టేషన్లు పదికి చేరనున్నాయి. ప్రజల అవసరాలకు అనగుణంగా నలువైపులా సబ్స్టేషన్లు ఉన్నాయి.