రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని, జనవరి 30 : తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఒక లక్షా నూటా పదహారు రూపాయలు అందిస్తూ, నిరుపేద కుటుంబాల్లో కాంతులు నింపుతున్న మనసున్న మారాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఆదివారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 13, 37 డివిజన్లలో ఇంటింటికీ వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ, సమైక్య పాలనలో తండాల్లో ఆడపిల్ల పుడితే అమ్ముకునే పరిస్థితులు ఉండేవనీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కేసీఆర్ పాలనలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మీ పుట్టిందని సంబరపడుతున్నారన్నారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించడానికి వెనుకడుగు వేయవద్దని పట్టుదలతో కృషి చేయాలని, గాంధీ జీవితమే అందుకు నిదర్శమని ఎమ్మెల్యే తెలిపారు. మహాత్మాగాంధీ 74వ వర్ధంతి పురస్కరించుకొని గోదావరిఖని గాంధీ చౌక్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి జడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో మేయర్ డా.అనిల్‌కుమార్, కార్పొరేటర్లు రాకం లత వేణు, పెంట రాజేశ్, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, చెల్కలపల్లి శ్రీనివాస్, భూమయ్య ఉన్నారు.