సిబ్బంది రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటాం
మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు
పారిశుధ్య కార్మికులకు యూనిఫాం పంపిణీ
జమ్మికుంట, డిసెంబర్ 29: కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, వారి ఆరోగ్య రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, యూనిఫాం, మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నదని తెలిపారు. అలాగే కార్మికులు కూడా తమ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. విధులు నిర్వహించే సమయంలో పీపీఈ కిట్లు, యూనిఫాం, మాస్కులు, గ్లౌజులు ధరించాలని చెప్పారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. తద్వారా ప్రజలు రోగాలబారిన పడకుండా ఉంటారని పేర్కొన్నారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. విధులను సక్రమంగా నిర్వహిస్తున్న కార్మికులను అభినందించారు. ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ బోళ్ల సదానందం(గోవిందు), ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ శ్రీకాంత్, కార్మికులున్నారు.
ఆర్పీలకు అవగాహన
జమ్మికుంట పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్ బోళ్ల సదానందం, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మెప్మా ఆర్పీలకు తడి చెత్త, పొడి చెత్త, పట్టణ పరిశుభ్రత, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఆర్పీలు వార్డుల్లో పర్యటించాలని, సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. కాలనీవాసులకు పరిశుభ్రతపై చైతన్యం కలిగించాలని సూచించారు. చెత్త సేకరణకు వచ్చే పారిశుధ్య కార్మికులకు సహకరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. చెత్తను రోడ్ల మీద పారేయకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ఇక్కడ ఆర్పీలు జ్యోతి, సరళ, తదితరులున్నారు.