మేనమామలా సీఎం కేసీఆర్
దేశంలో పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
బీసీ సంక్షేమ,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
తెలంగాణచౌక్, డిసెంబర్ 29: రాష్ట్రంలోని పేదింటి అడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం వరంలా మారిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో బుధవారం 187 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో పేద కుటుంబంలో పెండ్లీడు వచ్చిన ఆడబిడ్డల పెండ్లి చేయడం తల్లిదండ్రులకు భారంగా ఉండేదన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రజల బాగోగులను పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పేదింటి బిడ్డ పెండ్లిని ఘనంగా చేయాలని కల్యాణ లక్ష్మి పథకం తీసుకుచ్చారని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా రూ.లక్షా 116ను అందిస్తున్నారని తెలిపారు. అలాగే తొలి కాన్పు పుట్టింటి వారు చేసే సంప్రదాయం ఉన్న రాష్ట్రంలో వారిపై భారం పడకుండా ప్రభుత్వ దవాఖానలో కాన్పు చేస్తున్నారని, కేసీఆర్ కిట్ ద్వారా అడబిడ్డ పుడితే రూ.13వేలు, మగ బిడ్డ పుడితే రూ.12వేలు అందిస్తున్నారని చెప్పారు. బిడ్డకు కావాల్సిన వస్తువులను ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. పేద పిల్లల చదువుల కోసం గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రతి విద్యార్థి మీద రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. బీజేపీ రాష్ర్టాల్లో ఇలాంటి పథకాలు ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తూ కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రజలంతా దీవించాలని, ఎల్లప్పుడు మద్దతుగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ సునీల్‌రావు, నాయకులు చల్లా హరిశంకర్, కరీంనగర్ ఎంపీపీ లక్ష్మయ్య, జడ్పీటీసీ పురుమల్ల లలిత, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.