యాక్సిడెంట్ కేసులకు రూ.15 లక్షల ఇన్సూరెన్స్
చెక్కును అందజేసిన డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం
గోదావరిఖని, అక్టోబర్ 29 : బ్యాంకుల్లో కార్పొరేట్ సాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగులకు రూ.20 లక్షల వరకు చెల్లించే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీంను సింగరేణిలో తొలిసారిగా హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఒక లబ్ధిదారుడి కుటుం బానికి రూ.15 లక్షల చెక్కు అందించడం ద్వారా శుక్రవారం సంస్థ డైరెక్టర్లు ప్రారంభించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఇటీవల మృతిచెందిన కోసూరి సుదర్శన్‌కు సంబంధించి అతడి భార్య, కుమారుడికి ఈ చెక్కును సంస్థ డైరెక్టర్లు (ఆపరేషన్స్) చంద్రశేఖర్, (పర్సనల్, పా) బలరాం, (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు అందజేశారు. ఈ స్కీంను కంపెనీలో అమలు చేయడంలో డైరెక్టర్ ఫైనాన్స్ బలరాం ప్రత్యేక కృషి చేశారు. సింగరేణి ఉద్యోగుల ఖాతాలున్న వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులతో ఆయన స్వయంగా మాట్లాడి ఈ ఖాతాలను కార్పొరేట్ సాలరీ అకౌంట్లుగా మార్చడమే కాక బీమా స్కీం ప్రయోజనాలు కూడా వెంటనే అమలు చేయాలని కోరారు. దీనికి ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంకులు కూడా అంగీకరించడంతో కార్పొరేట్ సాలరీ అకౌంట్ ఉన్న ప్రతి కార్మికుడికి ఈ స్కీం వర్తిస్తుంది. ఎవరైనా కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందితే అతని ఖాతా ఉన్న బ్యాంకు వారు బీమా కింద రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు సొమ్ము చెల్లిస్తారు. జీఎం కో ఆర్డినేషన్ సూర్యనారాయణ, జీఎం (పర్సనల్) ఆనందరావు, జీఎం (పర్సనల్) బసవయ్య, జీఎం (ఆడిట్) సుబ్బారావు, ఏజీఎం ఫైనాన్స్ రాజేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్, అడిషనల్ మేనేజర్ వెంకటేశం, డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్ బోడ భద్రు, సెక్యూరిటీ సిబ్బంది ఆనంద్, సత్యనారాయణ పాల్గొన్నారు.