కడుపునిండినోనికి ఏం తెలుసు ఆకలి బాధ
పేదల ఆత్మగౌరవాన్ని పట్టించుకోని దద్దమ్మ ఈటల
4వేల ఇండ్లు ఇస్తే ఒక్కటి కూడా కట్టకపాయె
ఆ బాధ్యత మేం తీసుకుంటాం
గెల్లు గెలిచాక బరాబర్ 5వేల ఇండ్లు కట్టిస్తాం
ఎమ్మెల్సీ, రైతుబంధు రాష్ట్ర కో ఆర్డినేటర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ఇల్లందకుంట/ఇల్లందకుంట రూరల్, సెప్టెంబర్ 29: వృద్ధులు, దివ్యాంగులకు ఇస్తున్న ఆసరా పింఛన్లు.. పేద రైతులకు ఆదుకుంటున్న రైతుబంధు.. పేదింటి ఆడపిల్లల తల్లులకు ధైర్యాన్ని ఇస్తున్న కల్యాణలక్ష్మి వంటి పథకాలు పరిగెలెలా అయితయో ఈటల రాజేందర్ చెప్పాలని ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతుబంధు కో ఆర్డినేటర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. పథకాలు కడుపు నింపవని ఈటల మాట్లాడడం కరక్టేనా చెప్పాలని ప్రజలను ప్రశ్నించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఇల్లందకుంట మండలం మల్యాల, చిన్నకోమటిపల్లిలో ఇంటింటికీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అని ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్ మేనమామలాగా పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి ఇస్తూ పెండ్లిల్లు చేస్తున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ కిట్టుతో 16రకాల వస్తువులతో పాటు ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పునరుద్ఘాటించారు. ఇవన్ని డబ్బున్నోళ్లకు పరిగెలు కావచ్చు, కానీ పేదలకు కాదని, కడుపునిండినోనికి ఏం తెలుసు ఆకలి బాధ అని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల కోసం 24గంటల ఉచిత కరంటు ఇస్తుంటే, బీజేపీ వాళ్లు బావులకాడ మీటర్లు పెట్టాలని చూస్తున్నారని, ఉప ఎన్నికలో మీకు ఉచిత కరంట్ ఇచ్చేటోళ్లు కావాలా..? మీటర్లు పెట్టేవాళ్లు కావాలా..? ఆలోచించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు దొడ్డు రకం వడ్లు కొనమని బీజేపీ ప్రభుత్వం అంటున్నదని, పంజాబ్‌లో కొంటరని, మరి తెలంగాణలో ఎందుకు కొనరో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే రెండుమార్లు ఢిల్లీకి వెళ్లి దొడ్డు వడ్లు కొనాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని వివరించారు.
ఈటల ఏం చేసిండు..
ఈటల ఇప్పుడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని, 18ఏండ్లు ఇక్కడ ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా ఉండి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆయన ఏం చేయలేదు కాబట్టే ఇప్పుడు హుజూరాబాద్‌లో ఇన్ని పనులు జరుగుతున్నాయని, రోడ్లు, డ్రైనేజీలు, తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు వివరించారు. రాజేందర్‌ను ఇంతటివాడిని చేసి అనేక పదవులు కట్టబెట్టిన సీఎం కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు తిట్టడం సమంజసమేనా అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌కు 4వేల ఇండ్లు ఇస్తే ఒక్కటి కూడా కట్టలేదని, కానీ రాజేందర్ మాత్రం 4 ఇండ్లు కోట్లు పెట్టి కట్టుకున్నారని విమర్శించారు. పేదల ఇండ్లు కట్టక వారి ఆత్మగౌరవాన్ని పట్టించుకోని దద్దమ్మ ఈటల అని విమర్శించారు. బరాబర్ గెల్లు శ్రీనివాస్ గెలిచాక 5వేల ఇండ్లు పేదలకు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. గెల్లు శ్రీనివాస్ నిఖార్సైన మట్టి బిడ్డ అని, వచ్చే ఎన్నికలో ఓటేసి గెలిపించాలని కోరారు.
గెల్లు శ్రీనివాస్‌కు అపూర్వ స్పందన
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ప్రజలు నీరాజనం పడుతున్నారు. మల్యాల, చిన్నకోమటిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయతో కలిసి ఎన్నికల ప్రచారం చేయగా, మహిళలు, కళాకారులు కోలాటాలు, డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో గెల్లు శ్రీనివాస్ పూజలు చేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ ఎవరి వద్దకు వెళ్లి ఓటు అభ్యర్థించినా ‘నువ్వే గెలుస్తవ్ బిడ్డా’ అంటూ ఆశీర్వదించారు. ఇక్కడ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, గొల్ల కురుమ హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు గోస్కుల శ్రీనివాస్‌యాదవ్, ఇన్చార్జిలు సంపత్‌రెడ్డి, సర్పంచ్ సరోజన, ఎంపీటీసీ మోటపోతుల ఐలయ్య, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ ఉడుత వీరస్వామి ఉన్నారు.
హుజూరాబాద్‌కు మెడికల్ కాలేజీ తెస్తా: గెల్లు శ్రీనివాస్‌యాదవ్
‘ఉద్యమ బిడ్డను. లాఠీ దెబ్బలకు, పోలీసు కేసులకు భయపడకుండా ఉద్యమంలో ముందుండి కొట్లాడిన. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచే పార్టీలో ఉన్న. ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా, పేదింటి బిడ్డనైన తనను సీఎం కేసీఆర్ నన్ను ఆశీర్వదించి మీ ముందుకు పంపించిన్రు. అందరికీ శిరస్సు వంచి ప్రార్థిస్తున్నా, నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే ఎమ్మెల్యేగా మీకు సేవ చేయడంతో పాటు అభివృద్ధికి కృషి చేస్తానని’ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి హుజూరాబాద్‌కు మెడికల్ కాలేజీ సైతం తెచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మల్యాల, చిన్నకోమటిపల్లి గ్రామాల్లో మాట్లాడారు. నాలుగున్నర నెలలుగా హుజూరాబాద్‌కు ఎమ్మెల్యే లేకున్నప్పటికీ ఎక్కడా అభివృద్ధి ఆగకూడదని మండలాలకు ఇన్చార్జిలను పెట్టి పనులు చేయిస్తున్నారని కొనియాడారు. హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్ 4వేల ఇండ్లు ఇస్తే ఈటల ఒక్కటికూడా కట్టలేదన్నారు. మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, స్పీకర్ పోచారంలు తమ నియోజకవర్గాల్లో ఇండ్లను కట్టించి, గృహ ప్రవేశాలు కూడా చేయించారని, మరీ ఈటల ఎందుకు కట్టలేదో చెప్పాలని ప్రశ్నించారు. రెండున్నరేండ్లు అధికారం ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయకుండా తప్పుకున్నాడని విమర్శించారు. ఇప్పుడు ఆ బాధ్యతను తనకు ఇవ్వాలని, ఇండ్లు కట్టించి పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు. ఈటల మంత్రిగా ఉన్న సమయంలో చేయని పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణతో ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నదని దుయ్యబట్టారు. ఉద్యోగాలు ఇచ్చే టీఆర్ఎస్ కావాలా..? ఊడగొడుతున్న బీజేపీ కావాలా..? ఆలోచించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను ప్రజల కష్ట సుఃఖాలు తెలిసిన వ్యక్తిగా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.