అందరికీ అందుబాటులో ఉంటా
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్
హుజూరాబాద్ హైస్కూల్ గ్రౌండ్లో క్రీడాకారులు, వాకర్స్‌తో మాటాముచ్చట
హుజూరాబాద్, ఆగస్టు 29: రానున్న ఉప ఎన్నికలో తనను నిండు మనసుతో ఆశీర్వదించి దీవించాలని, ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కోరారు. ఆదివారం పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో క్రీడాకారులు, వాకర్స్‌తో ఉదయం మాటాముచ్చట నిర్వహించారు. ఏమైనా సమస్యలుంటే నేరుగా వచ్చి తనను కలువవచ్చన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడాకారులతో కలిసి కేక్ కట్ చేశారు. క్రీడాకారులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా హాకీ, కబడ్డీ, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్ బాల్ క్రీడాకారులు గెల్లు శ్రీనివాస్‌ను సన్మానించారు. అనంతరం 3,18,27వ వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. శ్రీనివాస్‌ను వృద్ధులు నిండు మనసుతో ఆశీర్వదించి ఉప ఎన్నికలో ఓట్లు వేస్తామని మాట ఇచ్చారు. 27వ వార్డులోని మారెట్వాడలో కూరగాయలు, దుకాణాదారులను కలిసి ఉప ఎన్నికలో మద్దతు ఇవ్వాలని కోరారు. మూడో వార్డులోని పద్మశాలీ సంఘం, ముస్లిం, కుమ్మరి, ప్రతాపవాడల్లో ప్రచారం చేశారు. పనిచేసే ప్రభుత్వానికే ఓటు వేయాలని కోరారు. అలాగే 18వ వార్డులోని ఆరెవాడలో ప్రచారం నిర్వహిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదోళ్ల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటు అభ్యర్థించారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు, మున్సిపల్ కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, ప్రతాప మంజులాకృష్ణ, ముకపల్లి కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఇమ్రాన్, తాళ్లపెల్లి రమే శ్, అనురాగ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
మల్లికార్జున స్వామి సన్నిధిలో గెల్లు
మానకొండూర్ రూరల్, ఆగస్టు 29: మండలంలోని గంగిపల్లి శ్రీఎదుగుట్ట మల్లికార్జున స్వామిని ఆదివారం హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, ఆలయ ధర్మకర్త, రెడ్డి సంఘం మండలాధ్యక్షుడు రెడ్డి సంపత్‌రెడ్డి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాస్ యాదవ్ స్వామివారికి ప్రత్యేక పూజ లు చేశారు. ముడుపు కట్టారు. ఆయన వెంట ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, కరీంనగర్ కార్పొరేటర్ వాల రమణారావు, మానకొండూర్ కేడీసీసీబీ డైరెక్టర్ అంజిత్ రావు, ధనలక్ష్మి ధాన్య విత్తన సహకార సంఘం అధ్యక్షుడు పారిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మాశం సాగర్, కిషన్‌రెడ్డి, బండ రవీందర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, గంగుల రవి, యాదవ సంఘం అధ్యక్షుడు సమ్మయ్య, ఉపాధ్యక్షుడు రాజు, ఒగ్గు పూజారులు, అర్చకులున్నారు.
గెల్లు తల్లి విస్తృత ప్రచారం
వీణవంక రూరల్, ఆగస్టు 29: టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపు కోసం ఆయన తల్లి లక్ష్మి ఆదివారం హిమ్మత్‌నగర్‌లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. కనపర్తిలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎంపీపీ రేణుకాతిరుపతిరెడ్డి, జడ్పీటీసీ వనమాలా సాధవరెడ్డి, వైస్ ఎంపీపీ లతాశ్రీనివాస్ ప్రచారం చేశారు. హిమ్మత్‌నగర్ సర్పంచ్ అంగిడి రాధ, పర్లపెల్లి తిరుపతి, శశికుమార్, పూర్ణచందర్, భాస్కర్‌రెడ్డి, గెల్లు రమేశ్ ఉన్నారు.
చిన్నపాపయ్యపల్లిలో గెల్లు సతీమణి శ్వేత..
హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 29: తన భర్త గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధి చేస్తాడని ఆయన సతీమణి శ్వేత కోరారు. చిన్నపాపయ్యపల్లిలో ఆమె ఇంటింటా ప్రచారం చేశారు. మహిళలకు బొట్టుపెట్టి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆమె వెంట ఎంపీపీ ఇరుమల్ల రాణి, ఎంపీటీసీ శిరీష, సర్పంచ్ దేవేంద్ర, గ్రామ మహిళలు ఉన్నారు.
వీణవంకలో రాజమౌళికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి