కొత్తపల్లి, ఆగస్టు 29 : క్రీడాకారులతో దేశానికి, రాష్ర్టానికి గుర్తింపు వస్తుందని, ప్రతి క్రీడాకారుడు గెలుపే లక్ష్యంగా సిద్ధం కావాలని టౌన్ ఏసీపీ తుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం యువజన, క్రీడాశాఖ, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం, అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన హాకీ, అథ్లెటిక్స్ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. డా.బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ అత్యుత్తమ ప్రతిభతో దేశానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చిందని, ఆయన జయంతి రోజున కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుతున్నదన్నారు. ఉదయం స్టేడియం నుంచి కమాన్‌చౌరస్తా వరకు 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా ఈనెల 21, 22వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో విజేతలైన భార్గవి, ప్రణయ్, వినయ్‌ను సత్కరించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పలు అంశాల్లో విజేతలైన వారికి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీవైఎస్వో కే రాజవీరు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నందెల్లి మహిపాల్, కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, పేటా అసోసియేషన్ అధ్యక్షుడు కడారి రవి, కార్యదర్శి సమ్మిరెడ్డి, క్రీడా సంఘాల బాధ్యులు కే సమ్మయ్య, జీ లక్ష్మణ్, సంపత్‌రావు, చల్ల హరిశంకర్, యూనిస్ పాషా, వాలీపాషా, బాబు శ్రీనివాస్, బిషన్‌సింగ్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
బేస్‌బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఆధ్వర్యంలో…
బేస్‌బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మీ కోసం కార్యాలయంలో బేస్ బాల్ సంఘం ప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన క్రీడా పాలసీతో క్రీడలకు, క్రీడాకారులకు మహర్దశ పట్టనుందన్నారు. కొద్ది రోజుల్లోనే సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, స్మార్ట్‌సిటీ నిధులతో కరీంనగర్‌లోని డా.బీఆర్ అంబేద్కర్‌స్టేడియంలో చేపడుతున్న అభివృద్ది పనులు చివరిదశకు చేరుకొని క్రీడాకారులకు అందుబాటులోకి రానున్నాయి. జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తుండడం గర్వకారణంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నందెల్లి మహిపాల్, బేస్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎండీ యూనిస్ పాషా, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, పెటా సంఘం అధ్యక్షుడు కడారి రవి, ఎస్జీఎఫ్ కార్యదర్శి కే సమ్మయ్య, పీఈటీలు, పీడీలు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.