హుజురాబాద్ టౌన్/జమ్మికుంటరూరల్, అక్టోబర్ 28: హుజూరాబాద్ ఉప పోరులో సెక్టోరల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సెక్టోరల్ అధికారులతో గురువారం సమావేశమై మాట్లాడారు. ఈ నెల 29న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి సిబ్బందితో కలిసి ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని ఆదేశించారు. ఓటర్లు కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో వీవీ ప్యాట్లు సున్నితంగా ఉంటాయని, వాటిని లైట్ల కింద పెట్టకూడదని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి వెళ్లేటప్పుడు వీవీ ప్యాట్లను చెక్ చేయవద్దని తెలిపారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను చెక్ చేసుకోవాలని సూచించారు. పోలింగ్ రోజు ఉదయం 5:30 గంటలు మాక్ పోలింగ్ నిర్వహించి, ఏజెంట్ల సమక్షంలో వాటిని క్లియర్ చేసి సీల్ చేసుకోవాలని తెలిపారు. పీవోలు, ఏపీవోలతో సమన్వయం చేసుకొని పోలింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్త్ డెస్, హెల్ప్ డెస్ తప్పనిసరిగా ఉండాలని, ఇందులో ఏఎన్ఎం, ఆశ వరర్ ఉండేలా చూడాలని తెలిపారు. ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే రిజర్వులో ఉన్న ఈవీఎంలను అందజేయాలని సూచించారు. పోలింగ్ ఏజెంట్లు రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు ధ్రువీకరణ పత్రం అందజేయాలన్నారు. వ్యాక్సిన్ పూర్తి కానివారు ఆర్టీపీసీఆర్ సెంటర్ నుంచి తెచ్చిన సర్టిఫికెట్‌ను చూపితే అనుమతించాలని తెలిపారు. ఏజెంట్లు తప్పనిసరిగా, ఆ పోలింగ్ కేంద్రంలో ఓటరుగా ఉండాలని సూచించారు. పోలింగ్ ముగిశాక కంట్రోల్ యూనిట్ బటన్ క్లోజ్ చేసుకోవాలని సూచించారు. ఈవీఎంలు పోలింగ్ సిబ్బందితో కలిసి కరీంనగర్ ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్‌కు రావాలని, అకడ స్ట్రాంగ్ రూమ్‌లో అందజేయాల్సి ఉంటుందన్నారు. రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా వెళ్లకూడదని తెలిపారు. సెక్టోరల్ అధికారులకు మెజిస్ట్రేరియల్ పవర్స్ ఉన్నాయని, పోలింగ్ రోజు ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఈ అధికారాన్ని ఉపయోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఏర్పాట్ల పరిశీలన
హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్, జమ్మికుంట పట్టణంతోపాటు ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి, రామన్నపల్లిలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్ వేర్వేరుగా పరిశీలించారు. పోలింగ్ సిబ్బంది కోసం వేసిన టేబుళ్లు, కుర్చీల అమరిక, షామియానాలు, తదితర వాటిని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇక్కడ అదనపు కలెక్టర్లు జీవీ శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారి సీహెచ్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సుమన్‌రావు, ఎంపీడీవోలు కల్పన, నర్సయ్య తదితరులున్నారు.
పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేశారు. హుజూరాబాద్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో కార్యాలయంలో 3వ రాండమైజేషన్‌ను కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు ముత్తు కృష్ణన్శంకర్ నారాయణ సమక్షంలో నిర్వహించారు. నియోజకవర్గంలోని 306 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే 306 మంది ప్రిసైడింగ్ అధికారులు, 306 అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 612 మంది ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. 40 శాతం మంది పోలింగ్ సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచామని చెప్పారు. అనంతరం పోలింగ్ విధులు నిర్వర్తించనున్న మైక్రో అబ్జర్వర్లను ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేశారు. ఇక్కడ అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్‌లాల్, నోడల్ అధికారి శ్రీధర్ తదితరులున్నారు.