సకాలంలో దళితబంధు సర్వే పూర్తి చేయాలి : కలెక్టర్ ఆర్వీ కర్ణన్
హుజూరాబాద్, జమ్మికుంటలో పరిశీలన
హూజూరాబాద్టౌన్/జమ్మికుంట ఆగస్టు 28 : దళిత బంధు పథకంపై లబ్ధిదారులకు సమగ్ర అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సర్వే అధికారులకు సూచించారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని ఎస్డబ్ల్యూకాలనీ, గాంధీనగర్, ఇందిరానగర్కాలనీ, జమ్మికుంట పట్టణంలోని ఎరుకలవాడ, మండలంలోని వెంకటేశ్వర్లపల్లి దళిత వాడలో డోర్ టూ డోర్ సర్వేలో పాల్గొని దిళతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎరుకలవాడకు చెందిన శనిగరపు లక్ష్మి, ఆమె నలుగురు కొడుకుల సమస్యను తెలుసుకుని, వారి వివరాలు వేర్వేరుగా నమోదు చేసి అర్హతను బట్టి ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత సమయంలో సర్వే పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని, లబ్ధిదారులకు తెలంగాణ దళిత బంధు పేరుతో ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లను తెరిపించేందుకు అవగాహన కలిగించి, బ్యాంకర్లతో మాట్లాడి ఖాతాలు తెరిపించాలన్నారు. నియోజకవర్గంలో 21 వేలకుపైగా కుటుంబాలు ఉన్నట్లు గుర్తించగా, బ్యాంకు లింకేజీ ఉండకుండా, కిస్తీలు కట్టే విధానం లేకుండా పూర్తిగా లబ్ధిదారులకు వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 30 శాతానికి పైగా సర్వే పూర్తయిందన్నారు. అందరూ ఒకే పని కాకుండా వేర్వేరు పనులు చేపట్టేలా యూనిట్లను నమోదు చేయించుకోవాలన్నారు. ఆర్థిక సాయం పొందిన దళిత కుటుంబం ఎకడైనా షాపులు పెట్టుకోవచ్చని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రవీందర్రెడ్డి, జిల్లా ప్రత్యేక క్లస్టర్ అధికారులు పద్మావతి, శ్రీధర్, రవీందర్, లింగారెడ్డి, తహసీల్దార్లు రాంరెడ్డి, రాజారెడ్డి, హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకన్న ఉన్నారు.