ఏర్పాట్లు చేసిన వ్యవసాయశాఖ
రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సాయం
ఉమ్మడి జిల్లాలో 6,74,110 మంది రైతులకు రూ.661.87 కోట్లు లబ్ధి
13,23,780 ఎకరాలకు పెట్టుబడి
ఈసారి 39,900 మంది కొత్త రైతులు
కరీంనగర్, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ) : యాసంగి పంట పెట్టుబడి ‘రైతుబంధు’వు వస్తున్నది. సాగుకు సిద్ధమవుతున్న కర్షకులకు సాయపడేందుకు సిద్ధమవుతున్నది. ఈ మేరకు నేటి నుంచి విడుతల వారీగా అందించేందుకు అధికారయంత్రాంగం కసరత్తు చేస్తున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుండగా, ప్రతి సంవత్సరం లబ్ధిదారులు పెరుగుతూ వస్తున్నప్పటికీ వెనుకడుగు వేయకుండా సాయం అందిస్తున్నది. వానకాలం సీజన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 6,34,210 మందికి రూ.649.97 కోట్ల సాయం అందించగా, ఈ యాసంగి సీజన్లో 6,74,110 మందికి 13,23,780 ఎకరాలకు రూ.661.87 కోట్ల పంట పెట్టుబడి ఇవ్వబోతున్నది. గత సీజన్‌తో పోలిస్తే 39,900 మందికి అదనంగా సాయం అందనున్నది.
రైతుబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. పథకం అమలుకు ముందు పెట్టుబడి కోసం రైతులు అష్టకష్టాలు పడేవారు. వేసిన పంటలు చేతికిరాక, వచ్చిన పంట అప్పులకు సరిపోగా మరో పంట పెట్టుబడి లేక అనేక మంది సన్న, చిన్న కారు రైతులు సేద్యం చేయలేని పరిస్థితులు కనిపించేవి. బ్యాంకుల్లో పంట రుణాలు దొరకక రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పు లు తెచ్చి పంటలు సాగు చేసేవారు. నిత్యకృత్యంగా జరిగే ఈ పరిణామాలతో రైతులు తీవ్రంగా నష్టపోతుండేవారు. పెట్టుబడి కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం 2018 వానకాలం నుంచి రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. మొదట ఎకరానికి రూ.4 వేల చొప్పున ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత రూ.5 వేలకు పెంచింది. దీంతో రైతులు పంట సాగుకు ముందు తమ పెట్టుబడి అవసరాలను తీర్చుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా రైతుబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తూ వస్తోంది. సీజన్‌కు ముందే నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తోంది. దీంతో రైతులు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకుని ఎంతో ధీమాతో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు అప్పుల కోసం శౌకారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పోయింది. బ్యాంకులు ఇచ్చినపుడే రుణాలు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. రైతుబంధు పథకంతో తమ జీవితాలు పూర్తిగా మారిపోయాయనే అభిప్రాయం రైతుల్లో వినిపిస్తోంది. ఈ సీజన్లో ఈ నెల 28 నుంచి విడుతల వారీగా అందించేందుకు ఏర్పా ట్లు చేసింది. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తం గా రైతుబంధు సాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఎకరంలోపు వారికి నేటి నుంచే జమ
పెద్దపల్లి జిల్లాలో 1, 44, 491మంది రైతులు ఉన్నారు. ఇందులో కొత్తగా పట్టా పాసు పుస్తకాలు పొందిన వారు ఈ నెల 10వ తేదీ వరకు 949మంది ఉన్నారు. వీరికి కొత్తగా యాసంగి పెట్టుబడి సాయం పొందేందుకు అవకాశం వచ్చింది. జిల్లాలోని రైతుల్లో ఎకరం లోపు వారికి మంగళవారం నుంచి వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వచ్చినవి వచ్చినట్లు జిల్లాలోని ఏఈవోలు యుద్ధప్రాతిపదికన అప్డేట్ చేశారు. ఇంకా కొంత మంది చేసుకోవాల్సి ఉంది.
ఇచ్చిన సాయం పంటకే..
మా ఊళ్లనే నాకు మూడెకరాలుంది. నాలుగేళ్ల సంది సర్కారు ఇచ్చిన సాయం మంచిగ పనిజేత్తంది. ఎకరాన ఇస్తున్న రూ.5 వేలు ఇత్తులు కొని అలుకుతున్నం. కేసీఆర్ సార్ అచ్చినంకనే మాకు పైసలత్తన్నయ్. ఆడ ఈడ సెయ్యిసాపి బాకీలు చెయ్యాల్సిన అవసరం లేకుంట పోయింది. టైంకు పైసలిత్తున్నడు అవి అటే ఖర్సు పెడుతున్నం. యాళ్లకు అన్ని దొరుకుతున్నయ్.