రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కలెక్టర్ కర్ణన్‌తో కలిసి బాల రక్షక్ వాహనం ప్రారంభం
విద్యానగర్, డిసెంబర్ 27: జిల్లాలోని బాలలకు సత్వర సేవలు అందించేందుకు బాల రక్షక్ వాహనం అందుబాటులోకి వచ్చినట్లు రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో బాల రక్షక్ వాహనాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పిల్లలను త్వరగా కాపాడడానికి ప్రభుత్వం బాల రక్షక్ వాహనం ఏర్పాటు చేసిందన్నారు. నవంబర్ 14న రాష్ట్రంలో 33 వాహనాలను సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అన్ని జిల్లాలకు కేటాయించారని తెలిపారు. ఆపదలో ఉన్న పిల్లలు ఎకడ కనపడినా హెల్ప్ లైన్ 1098 నంబర్‌కు ఫోన్ చేస్తే ఈ వాహనంలో సంబంధిత అధికారులు వచ్చి పిల్లల రక్షణ, సంరక్షణ చూసుకుంటారన్నారు. జిల్లాలో బాలలు ఎదురొంటున్న సమస్యలపై సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి పరిషరించాలన్నారు. గతంలో కంటే అత్యంత దగ్గరగా సేవలందించేందుకు అనుకూలంగా బాలల కోసం ప్రభుత్వం బాల రక్షక్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో సమస్యలు ఎదురొంటున్న బాలల వద్దకు అధికారులు వెళ్లి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. మంత్రి వెంట నగర మేయర్ వై.సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప-హరిశంకర్, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ ధనలక్ష్మి, డీసీపీవో శాంత, సీడబ్ల్యూసీ సభ్యులు, సీడీపీవో సిబ్బంది, ఐసీపీఎస్ సిబ్బంది, చైల్డ్‌లైన్ సిబ్బంది, సఖీ సిబ్బంది పాల్గొన్నారు.