పేదోళ్లను ఆగం చేస్తున్న బీజేపీని విశ్వసించరు
ఈటల ఇన్నాళ్లూ ఏం చేయలేదు.. ఇప్పడేం చేస్తడు?
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హుజూరాబాద్/ హుజూరాబాద్ చౌరస్తా, అక్టోబర్ 27 : డబ్బులతో ఓట్లను కొనాలని చూస్తున్న ఈటల రాజేందర్‌ను ప్రజలు విశ్వసించరని, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కే మద్దతు ఉంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. రాజేందర్ ఇన్నాళ్లూ అధికారంలో ఉండి ఏమీ చేయలేదని, ఇప్పుడేం చేస్తాడని ప్రశ్నించారు. రాజేందర్ ఇచ్చే డబ్బులకు, మందుకు, చికెన్‌కు అమ్ముడుపోరని, ప్రజలు టీఆర్ఎస్నే ఆదరిస్తారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకోసం పని చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే నడుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో రాజ్యసభసభ్యుడు బండ ప్రకాశ్, మాజీ మంత్రి ఎల్ రమణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌తో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈటలను తెలంగాణ ప్రజానీకానికి పరిచయం చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. లెఫ్ట్ భావజాలమన్న ఈటల బీజేపీలో చేరడంతోనే అతని ఆత్మ గౌరవం గురించి తెలుస్తుందన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతాంగానికి సాగునీరు అందిస్తుండడంతో ఎక్కడ చూసినా పచ్చని పంటపొలాలు కనిపిస్తున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీసీ జన గణన ఎందుకు చేపట్టడం లేదని, కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేని బీజేపీ బీసీలకు ఏం న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. ప్రజలంతా ఆలోచించి అన్నివర్గాల వారికి న్యాయం చేస్తున్న టీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
గీతన్నలకు అండ సీఎం కేసీఆర్
జమ్మికుంట రూరల్ ఆక్టోబర్ 27: గీత కార్మికులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. జమ్మికుంట మండలం తనుగులలో నిర్వహించిన గౌడ కులస్తుల ఆత్మీయ సమావేశానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి హాజరై, మాట్లాడారు. గౌడన్నల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని, ఆయన నాయకత్వాన్ని బలపరిచి గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ ఈటలకు ఆస్తుల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదని, స్వార్థ్యంతోనే బీజేపీలో చేరాడని దుయ్యబట్టారు. ఇక్కడ సర్పంచ్ వసంత-రామస్వామి, ఎంపీటీసీ నిరోశ-రామస్వామి, రైతు విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, గౌడ సంఘం రాష్ట్ర వర్రింగ్ ప్రెసిడెంట్ బోనగరి యాదగిరి. గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి బత్తిని లత గౌడ్ ఉన్నారు.