మహాయజ్ఞాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
ఇందుకు యావత్ ప్రజానీకం కదలాలి
కరీంనగర్ వేదికగా ముఖ్యమంత్రి పిలుపు
కలెక్టరేట్లో రెండున్నర గంటల పాటు సమీక్ష
అధికారులు, ప్రజాప్రతినిధులకు నిర్దేశం
విజయవంతానికి సలహాలు, సూచనలు
కరీంనగర్ డెయిరీ ప్రగతిపై సంతోషం
హుజూరాబాద్ నుంచి ప్రారంభమయ్యే దళిత చైతన్య జ్యోతి తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తుంది. దేశానికే వెలుగులు పంచుతుంది. అణగారిన దళిత వర్గాల్లో చైతన్యాన్ని తీసుకువస్తుంది. ఎట్లయితే స్పష్టమైన అవగాహనతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి గమ్యాన్ని ముద్దాడామో.. అంతే స్పష్టమైన అవగాహనతో దళిత బంధు ఉద్యమాన్ని నడిపించి, గమ్యాన్ని ముద్దాడుతం.
కరీంనగర్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దళితబిడ్డల దశాదిశను మార్చే దళితబంధు పథకంపై దళితబాంధవుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ వేదికగా దాదాపు రెండున్నర గంటల పాటు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, పథకం తీరుతెన్నులు, విధివిధానాలను వివరిస్తూనే విలువైన సలహాలు, సూచనలు చేశారు. ఈ పథకం విజయవంతం కావాలంటే.. దళితులతో ఇంటి మనుషుల్లా కలిసిపోయి స్థితిగతులను పూర్తిగా తెలుసుకోవాలని, వారు ఎంచుకున్న వ్యాపారరంగం, వారికున్న అనుభవం, సాధ్యాసాధ్యాలను పరిశీలించి, వారు సమాజంలో తలెత్తుకొని జీవించేలా మార్పు తేవాలని నిర్దేశించారు. దళితబంధు మహాయజ్ఞాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, అందుకు యావత్ తెలంగాణ ప్రజానీకం కంకణబద్ధులై కదలాలని పిలుపునిచ్చారు. ఈ గొప్ప స్కీం రాబోయే కాలంలో మహోద్యమంగా మారబోతున్నదని, దానికి హుజూరాబాద్ నియోజకవర్గమే ఒక ట్రైనింగ్ గ్రౌండ్ కాబోతున్నదని పునరుద్ఘాటించారు.
దళితబంధు రాబోయే కాలంలో మహా ఉద్యమంగా మారబోతున్నదని, దానికి హుజూరాబాద్ నియోజకవర్గమే ఒక ట్రైనింగ్ గ్రౌండ్ కాబోతున్నదని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. దళిత బిడ్డల దశాదిశను మార్చే ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఇందుకు యావత్ తెలంగాణ ప్రజానీకం కలిసి కదలాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో ‘తెలంగాణ దళితబంధు’ అమలు తీరుపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండున్నర గంటల పాటు సమీక్షించి దిశానిర్దేశం చేశారు. పథకం ద్వారా కల్పించాల్సిన లబ్ధి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సూచనలు, సలహాలు.. వంటి అంశాలపై వివరించారు. ఒక పథకం విజయవంతంగా అమలు కావాలంటే.. ముందుగా ప్రతి కుటుంబ స్థితిగతులను తెలుసుకోవాలని సూచించారు. లబ్ధిదారులతో ఇంటి మనుషుల్లా కలిసిపోయి వారి అనుభవాలు, ఆర్థిక పరిస్థితులు, ప్రస్తుతం వారు కోరుకునే వ్యాపారం, దాని అమలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చెప్పారు. చేపట్టిన పనిని సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితి లబ్ధిదారుడికి ఉందా, లేదా అనే విషయాన్ని పరిశీలించడంతోపాటు వారికి తెలియకపోతే అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. అంతేకాదు పథకం ప్రారంభించిన తర్వాత లబ్ధిదారులకు కావాల్సిన నైపుణ్యాన్ని అందించడం, అవసరమైన శిక్షణ ఇవ్వడం, లావాదేవీల గురించి వివరించాలని సూచించారు. ఎంచుకున్న వ్యాపారరంగంలో సదరు కుటుంబం ఆర్థిక స్వావలంబన సాధించి ఆత్మగౌరవంతో సమాజంలో తలెత్తుకొని తిరిగేలా చేయాలని చెప్పారు. చేపట్టిన పని పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ.. తగు సలహాలు, సూచనలు అందించాలన్నారు.
ఎస్సీ వెల్ఫేర్ మంత్రి, బీసీ వెల్ఫేర్ మంత్రి కరీంనగర్ జిల్లా వారే కావడం, ఫైనాన్స్ మినిస్టర్ పక్క నియోజకవర్గమే కావడం హుజూరాబాద్ పైలెట్ ప్రాజెక్టు విజయవంతానికి మార్గం మరింత సుగమం అయిందని సీఎం తెలిపారు. పాల ఉత్పత్తి రంగంలో కరీంనగర్ డెయిరీ సక్సెస్‌ను చూస్తే తనకెంతో గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. పాల ఉత్పత్తికి కరీంనగర్ జిల్లాలో అనుకూల వాతావరణం ఉందని, దళిత బంధులో భాగంగా డెయిరీ ఫామ్‌ల ఏర్పాటుకు ఔత్సాహికులను ప్రోత్సహించాలని, పాల సేకరణ విషయంలో కరీంనగర్ డెయిరీ యజమానుల సహకారం తీసుకోవాలని సూచించారు. అవసరమైతే లక్ష లీటర్ల పాలను అదనంగా కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కరీంనగర్ డెయిరీ చైర్మన్ ప్రకటించడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, రాహుల్ బొజ్జా, కరీంనగర్ కలెక్టర్ కర్ణన్, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, నాయకులు కౌశిక్‌రెడ్డి, పెద్దిరెడ్డి, బ్యాంకర్లు, సంక్షేమ శాఖ అధికారులు, రాష్ట్ర, జిల్లా దళిత సంఘాల నేతలు మేడి మహేశ్, కంసాల శ్రీనివాస్, బొగ్గుల మల్లేశం, దుంపల జీవన్, గోసుకంటి అరుణ్, నల్లా కనకరాజు, రాష్ట్ర స్థాయి దళిత బంధు రిసోర్స్ పర్సన్స్, తదితరులు పాల్గొన్నారు.
పర్యటన సాగిందిలా..
కరీంనగర్ శివారులోని తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్‌కు గురువారం రాత్రి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి గంగులతో పాటు పలువురు స్వాగతం పలికారు. రాత్రి అక్కడే బస చేయగా, శుక్రవారం ఉదయం సీఎంను పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉదయం 11.32 గంటలకు అల్గునూర్‌లోని ఏఎంఆర్ ఉన్నతి ఫంక్షన్‌హాల్ జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్, రమాదేవి దంపతుల కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వధూవరులు హరి లావణ్య, కిశోర్ బాబు జంటను ఆశీర్వదించారు. కొద్ది సేపు వివాహాన్ని వీక్షించిన ఆయన, స్థానిక నాయకులతో కలిసి విందు స్వీకరించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.13 గంటలకు రోడ్డు మార్గంలో కరీంనగర్ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. దళితబంధుపై సమీక్షా సమావేశం నిర్వహించి, తిరిగి హెలీకాప్టర్‌లో హైదరాబాద్ వెళ్లారు.