పెద్దపాపయ్యపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ దంపతుల ప్రచారం
ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
హుజూరాబాద్/హుజూరాబాద్ చౌరస్తా, ఆగస్టు 27: ‘మీ కాళ్లల్లో మెదిలిన బిడ్డలం.. నిండు మనస్సుతో ఆశీర్వదించండి’ అని హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఆయన సతీమణి శ్వేత గ్రామస్తులను కోరారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామంలో వారు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో తాను మొదటి నుంచి కేసీఆర్ వెన్నంటి ఉండి ఆయన అడుగుజాడల్లో నడిచానని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నా అలుపెరుగకుండా ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకూ ఎత్తిన పిడికిలి దించలేదన్నారు. ఆయన సతీమణి శ్వేత మాట్లాడుతూ.. తాను పెద్దపాపయ్యపల్లి ఆడబిడ్డనని గ్రామస్తులందరి ఆశీర్వాదాలు కావాలని కోరారు. వారి వెంట ఎంపీపీ ఇరుమల్ల రాణి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ సంగెం అయిలయ్య, సర్పంచ్ పోరెడ్డి రజిత, ఎంపీటీసీ వైద్యుల శిరీష, ఉప సర్పంచ్ రావుల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఇరుమల్ల సురేందర్‌రెడ్డి, పోరెడ్డి దయాకర్‌రెడ్డి, వైద్యుల ముకుందరెడ్డి, వార్డు సభ్యులు, యువకులు ఉన్నారు.
ఈటలను నమ్మితే నిండా ముంచిండు
గతంలో ఈటల రాజేందర్‌ను నమ్మి ఓటేస్తే నిండా ముంచిండు. గ్రామాభివృద్ధి గురించి అసలే పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు తీస్తే ఆయనకే వెన్నుపోటు పొడువాలని చూసిండు. ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వడం సరైందే. యువకుడికి టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీనివాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటం. -బండ కుమార్, పెద్దపాపయ్యపల్లి
గెల్లు శ్రీను గెలిస్తేనే పనులు జరుగుతయ్
వచ్చే ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే పనులు జరుగుతయ్. అందరికీ మంచి చేస్తున్న కేసీఆర్ సారుకు అండగా ఉండాలె. పనిచేసే ప్రభుత్వానికి తోడుగా ఉంటేనే అభివృద్ధి ఎక్కువగా జరుగుతది. మాలాంటి పేదల కోసం కల్యాణలక్ష్మి పథకం పెట్టి కేసీఆర్ సారు ఆదుకున్నడు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కే ఓటేస్తాం.