దళితబంధు యూనిట్ల పంపిణీ మొదలు
కోరుకున్నట్లుగానే నలుగురు లబ్ధిదారులకు వాహనాలు
ఇద్దరికి ట్రాక్టర్లు, ఒకరికి ట్రాన్స్పోర్ట్, మరొకరికి ట్రావెల్ వెహికిల్
కలెక్టరేట్లో తాళాలు అందజేసిన మంత్రులు కొప్పుల, గంగుల
సీఎం కేసీఆర్‌కు కుటుంబాల కృతజ్ఞతలు
ముకరంపుర, ఆగస్టు 26 : సొంత ఆస్తులు లేక కూలీ నాలీ చేసుకుని దుర్భర బతుకులతో చీకట్లో మగ్గిన దళిత కుటుంబాల్లో ఇక వెలుగులు విరజిమ్మనున్నాయి. దళితబంధు పథకం ప్రారంభమైన పది రోజుల్లోనే లబ్ధిదారులు ఫలాలు అందాయి. గురువారం మొదటి నలుగురు లబ్ధిదారులకు వారు ఎంపిక చేసుకున్న వాహనాలను మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ కరీంనగర్ కలెక్టరేట్లో అందజేశారు. ఇందులో మొదట వీణవంకలోని ఎస్సీ కాలనీకి చెందిన దాసారపు స్వరూప, ఇదే మండలం చల్లూరుకు చెందిన ఎలుకపల్లి కొమరమ్మకు రెండు ట్రాక్టర్లు, జమ్మికుంటలోని అంబేద్కర్ కాలనీకి చెందిన లబ్ధిదారు సుగుణకు ట్రాలీ, ఇదే మండలంలోని శాయంపేటకు చెందిన రాచపల్లి శంకర్‌కు మారుతి సుజికీ కంపెనీకి చెందిన ఎర్టిగా కారు తాళాలను అందించగా, వారు సంతోషంతో స్వీకరించారు. తమ బతుకులు మార్చే ఈ రోజును, సీఎం కేసీఆర్‌ను జన్మలో మరిచిపోమని కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ నిబద్దతకు నిదర్శనం : మంత్రి కొప్పుల
దళితుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వం ఉత్సాహం, నిబద్దతతో పనిచేస్తుందనడానికి దళిత బంధు పథకమే నిదర్శనమని మంత్రి కొప్పుల స్పష్టం చేశారు. నిన్నటి దాకా ఒకరి దగ్గర డ్రైవర్ గా పని చేసిన దళితుడు నేడు అదే వాహనానికి ఓనర్ గా మారడం పథకం గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం దళిత బంధు కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ఈ నెలలోనే ప్రారంభించి ఇదే నెలలో లబ్ధిదారులకు వాహనాలందించడం అభినందనీయమన్నారు. దళిత బంధుకు ఇప్పటి వరకు రూ.1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలో 21వేల దళిత కుటుంబాలు లబ్ధి చేకూరనుందన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందించి ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందన్నారు. దళిత బంధుతో ఆర్థికంగా అభివృద్ధి చెందుతామన్న నమ్మకం, ధైర్యం దళితుల్లో ఏర్పడిందన్నారు. ఇది మొదటి విడత మాత్రమేనని, దశల వారీగా ఎప్పటికప్పుడు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమం వంద శాతం సక్సెస్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదనే విషయాన్ని దళిత సోదరులు గమనిస్తున్నారని చెప్పారు. రూ.10లక్షలు ఏకమొత్తంగా బ్యాంకుతో సంబంధం లేకుండా ఇచ్చి గొప్ప సహాయం చేసిన సీఎం కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని మరిచిపోమని లబ్ధిదారులు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. వాహనాలు పొందిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇతర రాష్ర్టాలు ఈర్ష్యపడేలా దళితబంధు: మంత్రి గంగుల
దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈర్ష్యపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు అమలు చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. నిన్నటి దాకా డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి నేడు వాహన యజమానిగా, గుమాస్తాగా పనిచేసిన వ్యక్తి ట్రాలీ యజమానిగా మారడం దళిత బంధు గొప్పతనమేనన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా దళితుల సంక్షేమానికి ఏ ప్ర భుత్వం చేపట్టని విధంగా సీఎం కేసీఆర్ దళిత బంధు ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, రవాణా శాఖ ఉప కమిషనర్ చంద్ర శేఖర్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్ పాల్గొన్నారు.