జిల్లాలకు టీఆర్ఎస్ అధ్యక్షులను ప్రకటించిన అధిష్టానం
జగిత్యాలకు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు
పెద్దపల్లికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
రాజన్న సిరిసిల్లకు మాజీ ఎంపీపీ తోట ఆగయ్య
కరీంనగర్‌కు సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు
సమర్థత, విధేయత, ఉద్యమకారులకు పట్టం
కొత్త సారథుల నియామకంపై సర్వత్రా హర్షం
శ్రేణుల్లో నయాజోష్
కరీంనగర్, జనవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రసమితి అధిష్టానం బుధవారం జిల్లాలకు సారథులను ప్రకటించింది. ఉద్యమ నేపథ్యం, పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు కట్టబెట్టింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, అంకితభావంతో పనిచేసిన విధేయులకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావును నియమించింది. పెద్దపల్లికి ఉత్సాహవంతుడైన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటికి బాధ్యతలు అప్పగించింది. ఉద్యమకాలం నుంచి పార్టీకి వెన్నంటూ ఉంటున్న జీవీ రామకృష్ణారావును కరీంనగర్ పీఠంపై కూర్చోబెట్టింది. అన్నివేళలా పార్టీకి అండగా నిలిచిన తోట ఆగయ్యను రాజన్న సిరిసిల్ల జిల్లాకు నియమించింది. కొత్త జిల్లాల సారథుల నియామకంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా, శ్రేణుల్లో నయాజోష్ నెలకొన్నది.
తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా రథసారథులను ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జాబితా విడుదల చేసింది. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సమర్థ నాయకత్వానికి పెద్దపీట వేసింది. పార్టీ కోసం అంకితభావంతో పనిచేయడంతోపాటు క్రమశిక్షణ కలిగిన నాయకులకు అవకాశమిచ్చింది. మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించడంతోపాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం, అందరినీ కలుపుకొని వెళ్లే తత్వం కలిగిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుకు జగిత్యాల జిల్లా పీఠాన్ని అప్పగించింది. నల్ల నేలపై నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ… ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ.. క్రమశిక్షణతో కలిసి ముందుకు సాగుతున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించింది. ఇక ఆది నుంచీ పార్టీలో కొనసాగుతూ.. వివాదరహితుడిగా, నిగర్వి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుకు కరీంనగర్ అధ్యక్ష పీఠాన్ని అప్పగించింది. పార్టీ కోసం ఒక సైనికుడిగా, క్రమశిక్షణగల కార్యకర్తగా, నాయకుడిగా, వివాదరహితుడిగా, అందరినీ కలుపుకొని వెళ్లి పనిచేయడమే కాదు.. క్షేత్రస్థాయి నుంచి సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న మాజీ ఎంపీపీ తోట ఆగయ్యను రాజన్న సిరిసిల్ల జిల్లా రథసారథిగా ప్రకటించింది. అన్ని వర్గాలను సమ్మేళనం చేస్తూ.. అధిష్టానం రథసారథులను ప్రకటించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కొత్త అధ్యక్షుల నియాకమంతో.. టీఆర్ఎస్లో నయా జోష్ కనిపిస్తున్నది.
‘సారథి’ సంబురం
టీఆర్ఎస్ అధ్యక్షుల నియామకంపై గులాబీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. బుధవారం సంబురాల్లో మునిగితేలాయి. పటాకులు కాలుస్తూ. స్వీట్లు పంచుతూ, కేక్‌లు కట్‌చేస్తూ వేడుకలు జరుపుకున్నాయి. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా జీవీ రామకృష్ణారావు నియామకంపై గన్నేరువరంలో సర్పంచ్ లక్ష్మి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. మానకొండూర్‌లో జడ్పీటీసీ తాళ్లపెళ్లి శేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో, కొండపల్కలలో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి కేక్ కట్ చేశారు. వీణవంకలో స్వీట్లు పంచిపెట్టారు. జై కేసీఆర్, జై జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా విద్యాసాగర్‌రావు నియామకంపై కోరుట్లలో టీఆర్ఎస్వై నేతలు పటాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కోరుకంటి నియామకంపై పార్టీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. రామగుండంలోని 28వ డివిజన్లో సంబురాలు జరుపుకున్నారు. కార్పొరేటర్ ఇంజపురి పులేందర్ నేతృత్వంలో టీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చారు. రాజన్నసిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట ఆగయ్య నియమితులు కావడంతో పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేటలో కామారెడ్డి-కరీంనగర్ ప్రధాన రహదారిపై పార్టీ నేతలు పటాకులు కాల్చారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో పలువురు నేతలు ఆగయ్యకు అభినందనలు తెలిపారు.
రాజకీయ ప్రస్థానం
టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరారు. న్యాయవాద పట్టభద్రుడైన ఆయన, కరీంనగర్ న్యాయస్థానంలో న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావుకు అత్యంత సన్నిహితుడైన ఆయన 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించినప్పుడు సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీని వదలకుండా సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటున్నారు. వివాద రహితుడిగా, అందరినీ కలుపుకుని వెళ్లే నాయకుడిగా పేరున్న జీవీ రామకృష్ణారావు ఆది నుంచి పార్టీకి, సీఎం కేసీఆర్‌కు విధేయుడుగా పని చేస్తున్నారు. సింహగర్జన సభకు కరీంనగర్ నియోజకవర్గం నుంచి కో ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. 2001 నుంచి 2002 వరకు టీఆర్ఎస్ మానకొండూర్ మండల ఇన్చార్జిగా ఉన్నారు. 2002 నుంచి 2006 టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, 2006 నుంచి 2011 టీఆర్ఎస్ యువజన విభాగం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, 2001 నుంచి 2015 వరకు టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలో కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. పటాన్ చెరు, సంగారెడ్డి, నిర్మల్ నియోజకవర్గాల్లో పల్లెబాట ఇన్చార్జిగా ఉన్నారు. సిరిసిల్ల అసెంబ్లీ ఉప ఎన్నికలతోపాటు పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ ఉప ఎన్నికలు, హైదరాబాద్ కార్పొరేషన్, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, నాగార్జున సాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో పనిచేశారు. 2013లో ఆదిలాబాద్ జిల్లా శిక్షణ తరగతులకు ఇన్చార్జిగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికల సమయంలోనూ ఇన్చార్జిగా వ్యవహరించారు. రాజకీయాల్లో చురుకుగా ఉన్న రామకృష్ణారావు అనతి కాలంలోనే పార్టీలో క్రియాశీలకంగా ఎదిగారు. 2018 నుంచి సుడా చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
అందరినీ కలుపుకొని పోతా..
కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, ఇందుకు అందరినీ కలుపుకుని పోతానని సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఆయన, ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించిన తర్వాత జిల్లా నుంచి ఆ పార్టీలో చేరిన కొద్ది మందిలో తాను ఉన్నానని చెప్పారు. పార్టీ ఏ పని అప్పగించినా అంకిత భావంతో చేశానని చెప్పారు. తన రాజకీయ గురువైన రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో కలిసి పనిచేశానని చెప్పారు. కరీంనగర్ జిల్లా ఆది నుంచీ టీఆర్ఎస్ కంచుకోటలా ఉందని, ఇక్కడి నుంచి సీఎం కేసీఆర్ మూడు సార్లు ఎంపీగా గెలిచినపుడు తాను క్రియాశీలకంగా వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు పార్టీ బలోపేతంగా ఉన్నదని, మంత్రి, ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధుల సమన్వయంతో పార్టీని మరింత బలోపేతం చేసి 2023లో వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అధినేత కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ పాడి కౌశ్క్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీరందరి సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేసి జిల్లాలో తిరుగులేని శక్తిగా మార్చుతానని జీవీఆర్ స్పష్టం చేశారు.
నమ్మకాన్ని నిలబెడతా..
పెద్దపల్లి, జనవరి 26(నమస్తే తెలంగాణ): అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ తనపై మరింత బాధ్యత పెంచారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా పని చేస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్సీలు భానుప్రసాదరావు, ఎల్ రమణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని కలుపుకొని పార్టీ కార్యకర్తలు, నాయకులను సమన్వయపరుస్తూ ముందుకెళ్తానని చెప్పారు. టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఆయన, బుధవారం ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తనకు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే.. రాజకీయ జన్మనిచ్చింది మాత్రం టీఆర్ఎస్ పార్టేనని చెప్పారు. పార్టీ అధినేత కేసీఆర్.. ఒక ఉద్యమకారుడికి జిల్లా పార్టీ బాధ్యతలు ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తొలిసారిగా జిల్లా అధ్యక్ష పదవీ బాధ్యతలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో ఇప్పటికే పార్టీ తిరుగులేని శక్తిగా ఉందని, మరింత బలోపేతం కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ, పార్టీ సారథిగా.. ప్రజలకు వారధిలా పనిచేసేలా చూస్తానన్నారు. ప్రభుత్వ ఫలాలను గడపగడపకూ తీసుకెళ్లడంతోపాటు ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ జెండాను ఎగురవేసేలా పనిచేస్తామని చెప్పారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధినేత కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారాలతో పనిచేస్తున్నాని చెప్పారు.
రాజకీయ ప్రస్థానం..
విద్యార్థి దశలో విప్లవాలవైపు ఆకర్షితులైన ఆగయ్య, పీపుల్స్ వార్‌లో చేరి ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. 1993లో అరెస్టయ్యారు. విడుదలై బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిశారు. అప్పటి నుంచి గ్రామావృద్ధి కోసం యువజన సంఘాలతో కలిసి పనిచేశారు. 1994లో కాంగ్రెస్‌లో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ పార్టీలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2001లో కరీంనగర్ సింహగర్జన సభలో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1995లో ఓ సారి, 2006లో మరోసారి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ తరఫున 2001లో ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2006లో రెండోసారి ఎంపీటీసీగా గెలిచినా.. తర్వాత వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2001 నుంచి 2007వరకు ఎల్లారెడ్డిపేట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీగా గెలుపొందారు. 2016 నుంచి (రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావం) మంత్రి కేటీఆర్ సహకారంతో టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. జిల్లా స్థాయిలో కార్యకర్తలను సమీకరిస్తూ సమైక్యంగా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేశారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో సంక్షేమ ఫలాలు గడపగడపకూ చేర్చడంలో సఫలీకృతులయ్యారు. ప్రస్తుతం తోట ఆగయ్యకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, పార్టీ కార్యనిర్వా హక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సమన్వయంతో ముందుకెళ్తా
జగిత్యాల, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర సమితిలో జగిత్యాల జిల్లాను అగ్రపథంలో నిలుపడమే ధ్యేయంగా, ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ ఘన విజయం సాధించడ మే లక్ష్యంగా పనిచేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు సహకారంతో అన్నివర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పారు. టీఆర్ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఆయన, ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సీఎం కేసీఆర్ నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను గౌరవంగా భావిస్తున్నాని చెప్పారు. తనపై ఉంచిన నమ్మకానికి సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇరువై ఏండ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, జడ్పీటీసీగా ప్రారంభమైన తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతూనే ఉందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద జిల్లా జగిత్యాలనే అని, జిల్లాలో పార్టీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. పార్టీకి కార్యకర్తలే ప్రధానమైన బలమని, ప్రభుత్వానికి, పార్టీకి, ప్రజలకు మధ్య వారధులు వారేనని, వారి సంక్షేమానికి ప్రాధాన్యతమిస్తానని చెప్పారు. కష్టపడే కార్యకర్తలను గుర్తిస్తామని, వారికి తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపిన అనంతరం పార్టీ జిల్లా సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ ప్రధాన కార్యవర్గంతోపాటు అనుబంధ సంఘాల కార్యవర్గాలను సమన్వయం చేసి టీఆర్ఎస్ను ముందుకు నడిపిస్తామని చెప్పారు.