గతం కంటే ఘనంగా నిర్వహిస్తాం
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 25 : గతం కంటే ఘనంగా మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి పంచమ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వివరాలను ఆయన శనివారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆలయంలో ఫిబ్రవరి 4వ తేదీన మాఘ శుద్ధ తదియ ఉదయం 7.30 గంటలకు అధ్యయనోత్సవం, ప్రబంధ పారాయణంతో ఉత్సవాలు ప్రారంభవుతాయని తెలిపారు. 5న పారాయణం, సహస్ర కళశాభిషేకం, 6న పారాయణం, పరమపదోత్సవం ఉంటాయన్నారు. 7వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఇందులో భాగంగా 7న అంకురార్పణ, పుట్టమన్ను తెచ్చుట, శేషవాహన సేవ, 8న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవ, 9న కల్పవృక్ష వాహన సేవ, ఎదురుకోళ్లు, అశ్వ, గజ వాహన సేవ, 10న స్వామివారి కల్యాణోత్సవం, గరుడ వాహన సేవ, 11న హనుమత్, సింహ వాహన సేవ, 12న సేవాకాలమ్, మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, వసంతోత్సవం, పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. 13న వైభవంగా శోభయాత్ర ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమాలపై జనవరి మొదటి వారంలో భారీ సన్నాహక సమావేశం నిర్వహిస్తామని, రామానుజ సహస్రాబ్ది సమారోహం సందర్భంగా పండితులు అందుబాటులో ఉండకున్నా, ఇతర జిల్లాల్లోని పుణ్యక్షేత్రాలు, తిరుపతి నుంచి పండితులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
జనవరి 1 లేదా 2 తేదీల్లో 24-40 అడుగుల భారీ వేంకటేశ్వరస్వామి, 75-70 అడుగుల భారీ శ్రీరామపట్టాభిషేక విద్యుత్ దీపాల అలంకరణ బోర్డులను బస్టాండ్, తెలంగాణ చౌక్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో సేవ చేసుకునేవారు ఆలయంలో సంప్రదించాలని, దాతలను డబ్బులు అడగడం లేదని, తమ కుటుంబం, దేవాదాయశాఖ సంయుక్తంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. స్వామివారి దయ జిల్లా, రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కరోనా, ఒమిక్రాన్ నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వైదిక కార్యక్రమాలు, తొమ్మిది వాహన సేవలు, కల్యాణం, చక్రతీర్థ, వసంతోత్సవాల పుష్పయాగం, 13న శోభాయాత్ర యథాతథంగా ఘనంగా జరుపుతామని వివరించారు. సమావేశంలో మేయర్ సునీల్ రావు, నాయకుడు చల్లా హరిశంకర్, వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో పీచర కిషన్‌రావు, గంప రమేశ్, గోవిందపతి శ్రీవారి సేవాసమితి అధ్యక్ష, కార్యదర్శులు పాలవేడు శ్రీనివాస్, నటరాజ్ రవి, గోగుల ప్రసాద్, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.