సిరిసిల్ల టౌన్, జనవరి 25: స్వరాష్ట్రంలోనే దివ్యాంగులకు ఆత్మగౌరవం పెరిగిందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పింఛన్లతో పాటు అనేక సంక్షేమ పథకాలతో వారి బతుకులకు భరోసానిచ్చారని పేర్కొన్నారు. మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన దివ్యాంగులకు సహాయక, ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురికి బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఇతర ఉప కరణాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ దివ్యాంగులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అందుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. అలాగే నూరుశాతం సబ్సిడీపై ఉపకరణాలు అందజేస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి లక్ష్మీరాజం, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, ఆయా మండలాల జడ్పీటీసీలు, తదితర నాయకులు పాల్గొన్నారు.