ఎల్లారెడ్డిపేట, నవంబర్ 24: సర్కారు దవాఖాన అంటే ఒకప్పుడు అలసత్వానికి, అశ్రద్ధకు నిలయం అనేవారు. చిన్నపాటి జ్వరం, దగ్గు వచ్చినా ప్రైవేట్ దవాఖానకు పోతే తప్పా.. నయం కాదనే పరిస్థితి. ప్రస్తుతం టీఆర్ఎస్ హయాంలో అన్నిరకాల పరీక్షలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చేస్తున్నారు. గతంలో గర్భిణులు ప్రైవేట్ దవాఖానకు వెళ్లేందుకు వేల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి. చివరకు సాధరణ కాన్పు పరిస్థితి ఉన్నా సిజేరియన్ కేసుగా మార్చి ఆపరేషన్ చేసి మహిళలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యకు కారణమైన ఉదంతాలెన్నో ఉన్నాయి. అనుభవంతో కూడిన సంస్థాగత కాన్పులను చేస్తూ ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది.
‘సర్కారు’ ప్రసవాల్లో ప్రథమం..
ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వ్యాధులు, ఇద్దరు స్టాఫ్ నర్సులు, 18 మంది నర్సులు, 55 మంది ఆశ కార్యకర్తల ద్వారా సంస్థాగత కాన్పులు సర్కారు దవాఖానలో జరిపేందుకు నిర్విరామ కృషి చేస్తున్నారు. కొత్తగా పెండ్లయిన జంట వివరాలు సేకరించడంతోపాటు సదరు మహిళ గర్భణి అయినప్పటి నుంచి ప్రసవం అయ్యేంత వరకు ఆమె ఆరోగ్యంపై ఆరా తీసి రక్షణగా నిలుస్తున్నారు. సోమ, బుధ, శుక్రవారాల్లో గర్భిణులను పరీక్షిస్తూ అవసరమైనప్పుడు వారి చెకప్ కోసం 104 వాహనంలో సిరిసిల్ల ఏరియా దవాఖానకు తీసుకెళ్లి ఆశ కార్యకర్తలు పరీక్షలు చేయిస్తున్నారు. సాధ్యమైన మేర సాధారణ ప్రసవం కోసం డాక్టర్లు ప్రయత్నాలు చేస్తుండడంతో సర్కారు దవాఖానలోనే ప్రసవం చేయించేందుకు గర్భిణులు ఇష్టపడుతున్నారు. ఎల్లారెడ్డిపేటలో 2021 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 47 డెలివరీలను దవాఖానలో చేసి మధ్య తరగతి కుటుంబాలకు పూర్తి భరోసానిస్తున్నారు.