ఆపదలో ఆపన్నహస్తం అందిస్తూ..
పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ
అన్నింటా ముందుంటున్న క్లబ్ సభ్యులు
ప్రశంసలందుకుంటున్న లయన్స్ క్లబ్ ఎలైట్ పెద్దపల్లి
పెద్దపల్లి రూరల్, నవంబర్ 23;సామాజిక సేవే లక్ష్యంగా పెద్దపల్లి లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులు ముందుకు సాగుతున్నారు. ఆపదలో ఆపన్న హస్తం అందిస్తూ ఆత్మ బంధువుల్లా ఆదుకుంటున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు 15 మందితో ప్రారంభమైన క్లబ్‌ను ఆరు శాఖలుగా విస్తరింపజేసి సమాజ సేవలో మునిగితేలుతున్నారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు చేదోడు వాదోడుగా ఉంటూ బాధితులకు భోజనంతోపాటు నిత్యావసర సరుకులు అందించి ప్రశంసలందుకున్నారు.
పలు రకాల సేవ కార్యక్రమాలతోపాటు సామాజిక కార్యక్రమాలు చేస్తూ పెద్దపల్లి లయన్స్ క్లబ్ సభ్యులు ముందుకు సాగుతున్నారు. గతంలో లయన్స్ క్లబ్ అంటే కేవలం వైద్య పరీక్షలే అనుకునే స్థాయి నుంచి నేడు ఎలాంటి సామాజిక సేవా కార్యక్రమమైనా చేసేందుకు ముందుకు వస్తున్న లయన్స్ క్లబ్‌లు మూడు బ్రాంచులు ఆరు శాఖలుగా విస్తరించి అనేక రకాల సేవల్లో మునిగి తేలుతున్నాయి. లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ చేస్తున్న ఉత్తమ సేవలకుగాను ప్రత్యేకమైన అవార్డులను అందుకున్నారు. లయన్స్ క్లబ్ విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న 89 క్లబ్బుల్లో డిస్ట్రిక్ట్ 320-జి కింద ఎలైట్ పెద్దపల్లి క్లబ్‌కు అవార్డు లభించింది. ఈమేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ లైట్ పెద్దపల్లి అధ్యక్షుడు డాక్టర్ అశోక్‌కుమార్‌కు ఉమ్మడి జిల్లా బాధ్యులు అవార్డును ప్రదానం చేశారు.
2017లో ప్రారంభమైన లయన్స్‌క్లబ్ సేవలు
2017లో 15మందితో ప్రాంభమైన లయన్స్ క్లబ్ ఇప్పుడు శాఖోపశాఖలుగా పెరిగి 6 క్లబ్‌లకు పెరిగింది. ప్రధాన క్లబ్లో 60 మంది, లైట్ పెద్దపల్లి క్లబ్లో 60 మంది ఉండగా మిగిలిన క్లబ్‌లలో 30 మంది చొప్పున దాదాపు 300 మందితో లయన్స్ క్లబ్ విస్తరించి ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్నాయి. ప్రజలకు కంటి చూపును అందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఎలైట్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఐదు కంటి వైద్యశిబిరాలను నిర్వహించి 700 మందికి పరీక్షలు చేశారు. 50 మందికి కంటి ఆపరేషన్లు చేయించి, 50 మందికి ఉచితంగా అద్దాలు పంపిణీ చేశారు. 110 మంది నుంచి రక్తాన్ని సేకరించి పేదలకు ఆపద సమయంలో రక్తం అందించేందుకు తోడ్పాటునందించారు. క్లబ్ ప్రారంభమైనప్పటి నుంచి 759 సేవా కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టర్ డాక్టర్ సంగీతసత్యనారాయణ చేతుల మీదుగా కరోనా బాధితుల క్షేమం కోసం రూ.లక్ష వ్యయంతో 2 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందుబాటులో ఉంచి సేవలందించారు. రూ.65 వేలతో శవపేటికను పెద్దపల్లి ఎలైట్ క్లబ్ పేరున అందుబాటులో ఉంచారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లిలోని గోశాలలో సుమారు రూ.2 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ సభ్యుడు సతీశ్‌రెడ్డి సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం 150 బెంచీలు, 5 స్మార్ట్ టీవీలను పలు పాఠశాలలకు అందజేశారు.