రెండు విడుతల్లో వెయ్యి కోట్లు విడుదల
పది వేల కుటుంబాలకు లబ్ధి
ఐదు రోజుల్లో దళితబంధు ఖాతాలు తెరిపించాలని కలెక్టర్ ఆదేశం
సర్వేకు సిద్ధమవుతున్న అధికార యంత్రాంగం
కరీంనగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : హుజూరాబాద్‌లో దళిత బంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మరో 500 కోట్లు విడుదల చేసింది. ఈ నెల 9న మొదటిసారి 500 కోట్లు ఇవ్వగా, రెండు విడుతల్లో వెయ్యి కోట్లు ఇచ్చింది. ఈ నిధులతో పదివేల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. కాగా, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో నియోజకవర్గంలోని అనేక మంది దళితుల జీవితాల్లో వెలుగులు నిండునున్నాయి. కాగా, ఐదు రోజుల్లో దళితబంధు పేరిట బ్యాంకుల్లో ప్రత్యేక ఖాతాలు తెరిపించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించడంతో అధికారయంత్రాంగం సర్వేకు సిద్ధమవుతున్నది.
దళితబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఈ పథకం కోసం సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్‌గా ఎంచుకుని ఇక్కడ ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించి వారికి ఉపాధి కల్పించాలని సంకల్పిస్తున్నారు. అంతే కాకుండా ఈ నెల 9న మొదటి విడుతగా 500 కోట్లు విడుదల చేయడమే కాకుండా, 16న హుజూరాబాద్ మండలం శాలపల్లి- ఇందిరానగర్‌లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 15 దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. తాజాగా ప్రభుత్వం మరో 500 కోట్లు విడుదల చేయగా, దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి దళిత కుటుంబానికీ సాయం..
ప్రతి దళిత కుటుంబానికీ ఆర్థిక సాయం అందించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సమీక్షలు నిర్వహించారు. త్వరలో దళిత బస్తీలు, కాలనీలకు వెళ్లి సర్వే చేసేందుకు కలెక్టర్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నారు. దళితుల సంఖ్యను బట్టి ప్రతి మండలానికి నలుగురైదుగురు క్లస్టర్ అధికారుల ను నియమించి, నాలుగైదు బృందాలను ఏర్పా టు చేస్తున్నారు. మున్సిపాలిటీలైన హుజూరాబాద్‌కు ముగ్గురు, జమ్మికుంటకు ఐదుగురు జిల్లా స్థాయి అధికారులను క్లస్టర్ ఆఫీసర్లుగా నియమించారు. వీరు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసే లా సోమవారం కలెక్టర్ కర్ణన్ కరీంనగర్లో ప్రత్యే క సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
ఐదు రోజుల్లో ప్రత్యేక ఖాతాలు : కలెక్టర్
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు మున్సిపాలిల పరిధిలో ఉన్న ప్రతి దళిత కుటుంబంలోని ఒక లబ్ధిదారు పేరిట దళిత బంధు ఖాతాలను తెరవాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. వీటిని ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు. పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రెండో విడుతగా 500 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిన విషయాన్ని కలెక్టర్ అధికారికంగా ధ్రువీకరించారు. ఈ పథకం అమలుకు ఇదివరకే 500 కోట్లు విడుదల చేసిందని, మరో 500 కోట్లు సోమవారం వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు గ్రామాలు, మున్సిపాలిటీల్లో అధికారుల బృందాలు ప్రతి దళిత కుటుంబాల ఇంటికి వెళ్లి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేస్తారని చెప్పారు. లబ్ధిదారులందరికీ బ్యాంకుల్లో తెలంగాణ దళితబంధు కొత్త ఖాతాలను తెరిచేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
యూనిట్లను గ్రౌండింగ్ చేయాలి..
దళితబంధు పథకంలో లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లను వెంటనే మంజూరు చేస్తామని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ అధికారులు, ఆర్టీవో, ఎంపీడీవోల సమక్షంలో దళితబంధు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్ల గ్రౌండింగ్‌పై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి 15 మంది లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లను గ్రౌండింగ్ చేసేందుకు ఒప్పుకున్నారని, వాటిని వెంటనే చేయాలని ఆదేశించారు. టాక్సీ కోసం కార్లను ఎంచుకున్న యూనిట్ లబ్ధిదారులకు వెంటనే లైసెన్సులు మంజూరు చేసి, సంబంధిత షోరూం యజమానులతో మాట్లాడి వాహనాలను ఇప్పించాలని జిల్లా రవాణా అధికారిని ఆదేశించారు. వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలని ఇన్సూరెన్స్ కంపెనీల అధికారులకు సూచించారు. డెయిరీ యూనిట్ ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు వెంటనే కరీంనగర్, విజయ డెయిరీ సహకారంతో షెడ్లు నిర్మించి, బర్రెలను ఇప్పించాలని డైయిరీ అధికారులను ఆదేశించారు. అన్ని యూనిట్లకు ఇన్సూరెన్స్ తప్పకుండా చేయించాలన్నారు.
మినీ సూపర్ బజార్ యూనిట్లు ఎంపిక చేసుకున్న వారికి అనుకూలంగా షాపులను పరిశీలించి వారికి అవసరమైన సామగ్రి ఇప్పించాలన్నారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, లేడీస్ ఎంపోరియం యూనిట్ ఎంపిక చేసుకున్న వారికి వెంటనే తగిన శిక్షణ ఇప్పించి యూనిట్లను గ్రౌండింగ్ చేయాలన్నారు. అలాగే, ట్రాక్టర్ యూనిట్ ఎంచుకున్న లబ్ధిదారులకు సంబంధిత డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించి, ట్రాక్టర్, ట్రేలర్ కొనుగోలు చేసి ఇవ్వాలని ఆర్డీవోను ఆదేశించారు. సిమెంట్, ఐరన్ దుకాణం యూనిట్ ఎంపిక చేసుకున్న వారికి వెంటనే షాప్ ఏర్పాటు చేసుకునేందుకు మంచి స్థలం గుర్తించి యూనిట్ గ్రౌండింగ్ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, ఆర్టీవో చంద్రశేఖర్, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి నీతిని, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం నవీన్‌కుమార్, 15 మంది దళితబంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.