ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ‘సీఎం కప్-2021’ విజేత తెలంగాణ
536 పాయింట్లతో అగ్రస్థానం
74 పాయింట్లతో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్
బహమతుల ప్రదానం
కొత్తపల్లి, నవంబర్ 21: కరాటేలో తెలంగాణ మెరిసింది. ఆరో ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ ‘సీఎం కప్-2021’ను కైవసం చేసుకుంది. 536 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో మూడు రోజులుగా జరుగుతున్న పోటీలు ఆదివారం ముగిశాయి. ఇందులో 536 అత్యధిక పాయింట్లతో రాష్ర్టానికి చెందిన క్రీడాకారులు అన్ని విభాగాల్లో ప్రతిభ చూపి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకోగా, 74 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇక 37 పాయింట్లతో వెస్ట్‌బెంగాల్ క్రీడాకారులు మూడో స్థానంలో నిలిచారు. కరాటేలో సత్తాచాటిన విజేతలకు కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా(కాయ్) జాతీయ ప్రధాన కార్యదర్శి రజనీష్ చౌదరి, సీఎస్‌కేఐ చైర్మన్ చల్ల హరిశంకర్, టోర్నమెంట్ చైర్మన్ కత్తెరపాక కొండయ్య బహుమతులు ప్రదానం చేశారు.
అభినందనీయం: కాయ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రజనీష్ చౌదరి కరాటేలో రాష్ర్టానికి చెందిన క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించడం అభినందనీయమని కాయ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రజనీష్ చౌదరి కొనియాడారు. కరాటేకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, ఈ క్రీడతో శారీరక, మానసిక ధృఢత్వం పెరుగుతుందన్నారు.
ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు తప్పకుండా మార్షల్ ఆర్ట్స్‌లో తప్పకుండా శిక్షణ తీసుకోవాలని సూచించారు. కరీంనగర్ కేంద్రంగా ప్రతి ఏటా జాతీయస్థాయిలో చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించడం ప్రశంసనీయమని కొనియాడారు. సీఎస్‌కేఐ చైర్మన్ చల్ల హరిశంకర్ మాట్లాడుతూ క్రీడలకు, క్రీడాకారులకు రాష్ట్ర సర్కారు ప్రోత్సాహమిస్తున్నదని చెప్పారు. నూతన క్రీడా పాలసీతో తెలంగాణలో క్రీడాభివృద్ధి మరింత వేగంగా జరుగుతున్నదని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గురుకుల, సంక్షేమ హాస్టళ్లలో తప్పకుండా గంట పాటు శిక్షణ ఇప్పించాలని కోరారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు, ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. కాంటినెంటల్ షోటోకాన్ కరాటే డొ ఇండియా (సీఎస్‌కేఐ) ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 21 వరకు జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో సుమారు 15 రాష్ర్టాల నుంచి వెయ్యికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఈ శ్రీనివాస్, టోర్నమెంట్ టెక్నికల్ డైరెక్టర్ వీ రవీందర్‌కుమార్, కాయ్ తెలంగాణ అధ్యక్షుడు పీ వెంకటేశం, కోశాధికారి వీ నరేందర్, చైర్మన్ కే వసంత్‌కుమార్, కే సత్యశంకర్, లీగల్ అడ్వయిజర్ గౌరు రాజిరెడ్డి, సురభి వేణుగోపాల్, టోర్నమెంట్ నిర్వాహాకుడు మాడుగుల ప్రవీణ్, సీఎస్కే కోశాధికారి వంగల శ్రీధర్, సభ్యుడు ప్రసన్నకృష్ణ ఉన్నారు.
విజేతలు వీరే..
ఓపెన్ కటా సబ్ జూనియర్ బాలికల విభాగంలో టీ తేజ శ్రీ సాయి, ఎస్ లేఖన సాయిప్రియ, బాలుర విభాగంలో ఎల్ ధనుష్, ఆదిత్య, కెడెట్స్ బాలికల విభాగంలో ఎం తనుశ్రీ, ప్రణాళి, బాలుర విభాగంలో కే వేజనాథ్, ఎస్కే ఖాజా, సీనియర్ బాలుర విభాగంలో రోహిత్ చంద్రన్, జీ సర్వణకుమార్, బాలికల విభాగంలో ఎరిత్రి దేవ్, ప్రియ ప్రతిభచూపి నగదు బహుమతులు, ట్రోఫీలు కైవసం చేసుకున్నారు.