పెరిగిన సాగు విస్తీర్ణం
ఆరుతడి పంటలపై రైతుల ఆసక్తి
మెట్పల్లి, నవంబర్ 21: పోషక పదార్థాలు మెండుగా ఉండే మినుములకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలో ఆరుతడి, పప్పుదినుసుల్లో ఒకటైన మినుము సాగు పై పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ పెట్టుబడి, కొద్దిపాటి శ్రమ, స్వల్పనీటి అవసరాలతో విత్తిన 90రోజుల వ్యవధిలో పంట చేతికి రానున్నది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే కనిష్ఠంగా ఆరు నుంచి గరిష్ఠంగా తొమ్మిది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. మినుము క్వింటాల్‌కు ప్రభుత్వ మద్దతు ధర రూ.6,300 ఉండగా ప్రస్తుతం మార్కెట్లో రూ.6,500కు పైగా ధర పలుకుతున్నది. అలాగే సాగుకు పెద్దగా ఖర్చు ఉండదు. ఎకరా సాగుకు దుక్కి దున్నడం, కలుపుతీత, పంటకోత తదితర అవసరాలకు పెట్టుబడి వ్యయం రూ.5వేల నుంచి రూ.6వేల వరకు అవుతుంది. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాల్లోని పలు ఆయకట్టేతర గ్రామాల్లో ప్రస్తుతం సుమారు 500 ఎకరాల్లో రైతులు మినుము సాగు చేస్తున్నారు. గతేడాది ప్రభుత్వం సరఫరా చేసిన సబ్సిడీ విత్తనాలను కొనుగోలు చేసుకుని పలువురు రైతులు దీనిని సాగు చేశారు. వారికి దిగుబడితోపాటు మార్కెట్లోనూ ధర సంతృప్తినిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత యాసంగిలోనూ మినుము సాగుపై మరింత మంది రైతులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది.