సత్తాచాటుతున్న అతిథ్య జట్టు
77 పాయింట్లతో తెలంగాణ క్రీడాకారుల ముందంజ
కొత్తపల్లి, నవంబర్ 20 : కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ సీఎం కప్-2021 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండోరోజైన శనివారం అతిథ్య జట్టయిన తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటి పతకాలను ఒడిసిపట్టారు. అండర్-14లో క్రీడాకారులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కటా, కుమిటీ విభాగాల్లో వివిధ రాష్ర్టాలకు చెందిన 600 మంది క్రీడాకారులకు పోటీలు నిర్వహించగా తెలంగాణ క్రీడాకారులు ప్రతిభ చూపారు. 77 పాయింట్లు సాధించి మొదటిస్థానంలో కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు 63 పాయింట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. హర్యానా 60, తమిళనాడు 38, కర్ణాటక 33, కేరళ 30, మధ్యప్రదేశ్ 27, పశ్చిమబెంగాల్ 27, మహారాష్ట్ర 22, ఢిల్లీ క్రీడాకారులు 20 పాయింట్లు సాధించి ఆ తరువాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ముఖ్య అతిథి మర్రు వెంకట రేవంత్ విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీలు ఆదివారంతో ముగియనుండగా ఉదయం అండర్-14లో క్రీడాకారులకు పోటీలు నిర్వహించి విజేతలకు సుమారు 3 లక్షల నగదు బహుమతులను అందజేయనున్నట్లు టోర్నీ చీఫ్ ఆర్గనైజర్ ఈ శ్రీనివాస్ పేర్కొన్నారు.
రాష్ర్టానికి పేరు తీసుకువస్తాం
కరాటే క్రీడాకారులకు, క్రీడకు కరీంనగర్ కేంద్రంగా మారడం సంతోషంగా ఉంది. దేశవ్యాప్తంగా కరాటేకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకే ప్రతి సంవత్సరం కరీంనగర్‌తో పాటు తెలంగాణ, ఏపీలో పోటీలు నిర్వహిస్తున్నం. మహిళలు, విద్యార్థినులు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందితే ఆత్మైస్థెర్యం పెరుగుతుంది. జాతీయ పోటీలను సమర్థవంతంగా నిర్వహించి కరీంనగర్‌తో పాటు రాష్ర్టానికి మంచిపేరు తీసుకువస్తా.
-శ్రీనివాస్, కరాటే పోటీల చీఫ్ ఆర్గనైజర్