నగరంలో శ్రావణ శుక్రవారం సందడి
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
కమాన్‌చౌరస్తా, ఆగస్టు 20: శ్రావణమాసం రెండో శుక్రవారం పురస్కరించుకొని నగరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయమే ఇంటిల్లిపాది సమీప ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ఉపవాసం పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనలో గడిపారు. ఆలయాల్లో బారులు తీరి దేవతామూర్తులను సందర్శించుకున్నారు. వరలక్ష్మీ అమ్మవారికి పసుపు, కుంకుమ, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పాత బజార్ శివాలయంలో అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం విశేష పూజలు చేశారు. జ్యోతినగర్ హనుమాన్ సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ఆలయ ఈవో నాగుల అనిల్‌కుమార్, అర్చకులు రామశర్మ, రాజేశ్వర్‌శర్మ, కార్తీక్‌శర్మ, భక్తులు పాల్గొన్నారు. చైతన్యపురికాలనీలోని మహాశక్తి ఆలయంలో అమ్మవార్లకు అర్చకులు విశేష అభిషేకం, అర్చనలు చేశారు. అర్చకులు కొరిడె శ్రీధర్‌శర్మ, కొరిడె శ్రీనివాస్‌శర్మ, వంశీకృష్ణ, సముద్రాల శేషు, భక్తులు పాల్గొన్నారు. అశోక్‌నగర్‌లోని మళయాల సద్గురు గీతామందిర్‌లో అభిషేకం, అర్చనలు జరిగాయి. యజ్ఞవరాహస్వామి క్షేత్రంలో వసుధాలక్ష్మీ, వరదుర్గ, వాగ్వాదిని మహాసరస్వతీ సన్నిధిలో వ్రతాలు ఆచరించారు. వావిలాలపల్లి హనుమత్ సహిత కనక దుర్గా ఆలయంలో శ్రీచక్రార్చన, కుంకుమార్చన నిర్వహించారు. అశోక్‌నగర్‌లోని వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో జరిగిన విశేష పూజల్లో ఆలయ అధ్యక్ష, కార్యదర్శులు చిట్టుమల్ల శ్రీనివాస్, కాచం రాజేశ్వర్, బొల్లం శ్రీనివాస్, రాచమల్ల భద్రయ్య, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కమాన్‌రోడ్‌లోని రామేశ్వరాలయంలో పర్వతవర్ధిని అమ్మవారికి విశేషాలంకారం చేశారు.
అంజనాద్రి ఆలయంలో..
తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమంలో భాగంగా భగత్‌నగర్ అంజనాద్రి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. ఈ సందర్భంగా భక్తులకు లక్ష్మీదేవీ ప్రతిమను అందజేశారు. చిలకపాటి హనుమంతరావు, టీటీడీ వేదపారాయణ పండితుడు శ్రవణ్‌కుమార్, ఆలయ అర్చకులు మంగళంపల్లి రామకృష్ణ శర్మ, రఘు, శ్రీనివాస్, మురళి తదితరులు పాల్గొన్నారు.