గురువారం 24 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 13, 2020 , 01:54:26

అన్నీ మంచి శకునాలే..

అన్నీ మంచి శకునాలే..

  •  కలిసొచ్చిన వాన‘కాలం’ n అన్ని విధాలా అందిన సర్కారు ప్రోత్సాహం 

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: వానకాలం సాగు జోరందుకున్నది. సర్కారు ప్రోత్సాహం అందడం, పుష్కలంగా జలాలు అందుబాటులో ఉండడంతో రైతాంగం ఉత్సాహంగా కదులుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు వరి, పత్తికి ప్రాధాన్యమిచ్చింది. ఇప్పటికే వ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది. 

తరలివస్తున్న కాళేశ్వర జలాలు

కాలంతో సంబంధం లేకుండా కాళేశ్వర జలా లు తరలివస్తున్నాయి. మేడిగడ్డ నుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశం వయా ఎల్‌ఎండీ దాకా పరుగులు తీస్తున్నాయి. వానకాలం సాగు కోసం సీజన్‌ ముందునుంచే విడతల వారీగా నీటిని ఎత్తిపోస్తున్నారు. వారం పది రోజుల నుంచి లింక్‌-1, 2లో మోటర్లను నడిపిస్తున్నారు. గోదారి జలాలను తరలిస్తూ జలాశయాలను నింపుతున్నారు. బుధవారం సాయంత్రం వరకు శ్రీరాజరాజేశ్వర జలాశయంలో 14.25 టీఎంసీల నీరు ఉండగా, లోయర్‌ మానేరు డ్యాంలో 9.421 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

వరదాయిని ఎస్సారెస్పీ

ఉత్తర తెలంగాణ వరదాయిని ఎస్సారెస్పీ క్రమంగా జలకళను సంతరించుకుంటున్నది. 1091.0 అడుగులతో 90.313 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగి ఉన్న ఈ ప్రాజెక్టులో గతేడాది ఆగస్టు 12 నాటికి కేవలం 15 టీఎంసీల నీరే ఉన్నది. కానీ, ఈ సారి దాదాపు 40 టీఎంసీలకు నీరు ఉండడంతోపాటు, నిత్యం వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు క్యాచ్‌మెంట్‌ పరిధిలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో మరింత నీరు త్వరలోనే వచ్చే చేరే అవకాశమున్నది. వాస్తవానికి ఎస్సారెస్పీ కింద ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల పరిధిలోని దాదాపు తొమ్మిది లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, గత పాలకుల నిర్లక్ష్యం గా ఎప్పుడూ పూర్తి స్థాయిలో నీరివ్వడం సాధ్యం కాలేదు. అయితే ప్రాజెక్టుకు దిగువన ఉన్న తొలి జిల్లా జగిత్యాల కావడంతో మొదటి నుంచి ప్రాజెక్టు వల్ల ఎక్కువ లబ్ధిని పొందుతూ వచ్చింది. అయితే దశాబ్దాల కాలంగా ఎస్సారెస్పీలోకి ఆశించినంత మేర నీరు రాలేదు. దీంతో నీటిని కేవలం తాగునీటి అవసరాలు, ఇతర జిల్లాల సాగుకు వినియోగించడంతో జగిత్యాల జిల్లా రైతాంగానికి ఇబ్బందులు తప్పలేదు. అయితే ఈసారి నీరు సమృద్ధిగా చేరుతుండడం ఆశలు రేపుతున్నది. ఇప్పటికే కాళేశ్వర జలాలు చేరుతుండగా, ఇక సాగుకు ఢోకా ఉండదనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతున్నది.

ఆయకట్టుకు ‘పునర్జీవం’..

సమైక్య రాష్ట్రంలో వట్టిపోయిన వరద కాలువ, ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో వరదాయినిలా మారింది. 122 కిలోమీటర్ల మేర నిండు గోదారిని తలపిస్తూ, ఆయకట్టుకు భరోసా ఇస్తున్నది. నాలుగు రిజర్వాయర్లుగా మారిన ఈ వరద కాలు వ పొడవునా 1.7టీఎంసీల నీరు నిల్వ ఉంచుతున్నారు. అలాగే దీని పరిధిలో చెరువుల సామర్థ్యం 1.3 టీఎంసీలు కాగా, ఇప్పటికే వానకాలం పంటల కోసం నింపుతున్నారు. వరద కాలువతో జగిత్యాల జిల్లాకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుతున్నది. వరద కాలువ పొడవునా అన్ని చెరువులను నింపారు. దీంతో కొన్నేళ్లుగా నాన్‌ ఆయకట్టుగా గుర్తింపు పొంది, సాగుకు నోచుకోని భూములు సైతం సస్యశ్యామలంగా మారాయి. ఈ సారి కొత్తగా 80 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి.

పై పైకి భూగర్భజలాలు

కాళేశ్వర జలాలతో ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ చెరువులు నిండుకుండల్లా మారాయి. శ్రీరాజరాజేశ్వర జలాశయం, లోయర్‌ మానేరు డ్యాం జలకళను సంతరించుకున్నాయి. ఇటు వరద కాలువ జీవనదిలా మారింది. గోదారి నీళ్లు పుష్కలంగా ఉండడంతో అంతటా భూగర్భ జలాలు పైపైకి చేరాయి. మెట్టప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఆరున్నర మీటర్లు పైకి వచ్చాయి. మిగతా జిల్లాల్లోనూ అదే పరిస్థితి ఉన్నది. జగిత్యాల జిల్లా లో మొన్నటి వరకు పాతాళంలో ఉన్న ఊట, ప్రస్తుతం నాలుగైదు మీటర్ల పైకి చేరుకున్నది. దీంతో బావులు, బోర్లపై ఆధారపడి సాగు చేసే రైతుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తున్నది. జగిత్యాల జిల్లాలో దాదాపు 12వేలకు పైగా విద్యుత్‌ మోటర్లను అమర్చి, వ్యవసాయం సాగిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోనే బోర్లు, బావులపై ఆధారపడి సేద్యం చేస్తున్న జిల్లాగా జగిత్యాల తొలిస్థానంలో ఉన్నది. ఈ సారి భూగర్భ జలాలు పెరిగిపోవడంతో రైతుల సేద్యానికి ఇకా ఢోకా లేని పరిస్థితి కనిపిస్తున్నది.

సమృద్ధిగా వర్షాలు

ఉమ్మడి జిల్లాలో నాలుగైదు రోజులుగా జోరు గా వర్షం కురుస్తున్నది. కరీంనగర్‌ జిల్లాలో గతేడాది కంటే ఈ సారి ఎక్కువే పడింది. ఇప్పటికే 6 మండలాల్లో 20శాతం కంటే ఎక్కువగా, 10 మం డలాల్లో సాధారణం కంటే 19శాతం అధికంగా కురిసింది. 2019లో జూన్‌, జూలై, ఆగస్టు నెలలో 92 రోజుల్లో కేవలం 29 రోజులే వర్షాలు కురిశాయి. ఈ యేడాది ఇదే నెలల్లో చూస్తే ఇప్పటి వరకు 73 రోజుల్లోనే 31 రోజులు పడ్డాయి. ఈ మూడు నెలల సాధారణ వర్షపాతం 468.6 మిల్లీ మీటర్లు కాగా, 546.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఇక ఈ యేడాది ఇంకా 19 రోజులు మిగిలి ఉండగానే 587.0 మిల్లీ మీటర్లు పడింది. జగిత్యాల జిల్లాలో ఆగస్టు 12నాటికి 484.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే కొంత తక్కువగా నమోదైంది. మొత్తంగా కొడిమ్యాల, కథలాపూర్‌ మండలాలు మినహా మిగతా అన్ని మండలాల్లోనూ సగటుగా పడింది. మెట్‌పల్లి మండలంలో అత్యధికంగా 34.0 మిల్లీమీటర్లు, కోరుట్లలో 30.6 మిల్లీమీటర్లు, కొడిమ్యాలలో 30.0 మీల్లిమీటర్లుగా రికాైర్డెంది. పెద్దపల్లి జిల్లాలో సగటున 598.3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 598.2మిల్లీ మీటర్లు రికార్డయింది. రామగుండం మండలంలో సాధారణం కంటే ఎక్కువగా అత్యధికంగా 735 మిల్లీమీటర్లు నమోదైంది. అత్యల్పంగా ఎలిగేడు మండలంలో సాధారణం కంటే చాలా తక్కువగా 449.6మిల్లీ మీటర్లు పడింది. మెట్టప్రాంతమైన రాజన్నసిరిసిల్ల జిల్లాలో 548. 54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

ఊపందుకున్న సాగు

ఇప్పటికే గోదారి జలాలతో చెరువులు, కుంట లు నిండాయి. నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడా కుండపోతలా పడుతున్నాయి. వానలు పడుతుండడంతో రైతులు ఉత్సాహంగా ఉన్నారు. కాలువలు, కుంటలు, చెరువులు, బావుల్లోకి నీరు చేరడంతో సాగుకు సమాయత్తమయ్యారు. అన్నీ మంచి శకునాలే కావడంతో ఇప్పటికే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదివరకే నారు పోసి ఉంచుకున్న రైతులు నాట్లు వేస్తున్నారు. కొందరు కొత్తగా మడులు సిద్ధం చేసుకుంటున్నారు. మరికొందరూ పత్తిలో కలుపు తీస్తున్నారు. మొత్తంగా గతంతో పోలిస్తే ఈ సారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు వరి, పత్తి వైపే మొగ్గు చూపింది. 


logo